Tirumala : తిరుమల వెంకన్న భక్తులకు అలర్ట్.. శ్రీవారి పుష్కరిణి మూసివేత
అలాగే, నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేశారు. Tirumala Pushkarini

Tirumala Srivari Pushkarini(Photo : Google)
Tirumala Pushkarini : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. నెల రోజుల పాటు అంటే.. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూసివేస్తారు. ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పుష్కరిణిలో నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఇందుకోసం ఆగస్టు 1వ తేదీ నుండి 31 వరకు పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే, నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి మరమ్మతులను పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల సమయం పట్టనుంది.
పుష్కరిణి మరమ్మతుల కోసం తొలి 10 రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.
ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని మార్చడం ఆనవాయితీ. నిల్వ ఉన్న మురుగునీటిని పైపుల ద్వారా నీటిశుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. నెల రోజులపాటు పుష్కరిణి శుద్ధి పనులు కొనసాగుతాయి. పుష్కరిణి అడుగుభాగం, మెట్లను పూర్తిగా శుభ్రం చేస్తారు. పాచి, చెత్తా చెదారాన్ని తొలగించి రంగులు వేస్తారు. ఆ తర్వాత లక్షల గ్యాలెన్ల నీటితో పుష్కరిణిని నింపుతారు. ఈ పనుల కారణంగా సాయంత్రం ఊరేగింపు సమయంలో ఉత్సవర్లకు సమర్పించే పుష్కరిణి హారతిని కూడా రద్దు చేస్తారు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యే వరకు భక్తులు స్నానపు గదుల్లోనే స్నానమాచరించాల్సి ఉంటుంది.
Also Read..Good luck items : అదృష్టం తెచ్చే వస్తువులు .. ఇంట్లో తప్పకుండా ఉంచుకోండి..
శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా పుష్కరిణి ఉంటుంది. అందులో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమలకొండ మీదకు ఆ వేంకటేశ్వరుడు దిగి వచ్చే వేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరుంది.