అలాంటి వారు తిరుమలకు కాలినడకన రావొద్దు- టీటీడీ కీలక సూచన

అలాగే మెట్ల మార్గాల్లో ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలను తెలిపింది.

అలాంటి వారు తిరుమలకు కాలినడకన రావొద్దు- టీటీడీ కీలక సూచన

TTD Key Instructions (Photo Credit : Google)

Updated On : October 25, 2024 / 10:32 PM IST

TTD Key Instructions : తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. ఇటీవల తిరుమలకు కాలినడకన వస్తూ కొందరు భక్తులు అస్వస్థతకు గురి కావడంతో కొన్ని కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు మెట్ల మార్గాల్లో రావొద్దని సూచించారు. ఒకవేళ రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంది. అలాగే మెట్ల మార్గాల్లో ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలను తెలిపింది.

60ఏళ్లు దాటిన వృద్ధులు.. షుగర్, ఉబ్బసం, రక్తపోటు, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావొద్దని టీటీడీ సూచించింది. అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న భక్తులు వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలంది. అలాంటి వారికి నడక మార్గం మంచిది కాదని తెలిపింది.

తిరుమల శ్రీవారు కొలువైన కొండ.. సముద్రమట్టానికి ఎత్తులో ఉంటుంది కాబట్టి.. ఆక్సిజన్ స్థాయి తక్కువలో ఉంటుందని గుర్తు చేసింది టీటీడీ. అందుకే గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్న వారు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదని తెలిపింది. వారు నడిచి రావటం చాలా ఒత్తిడితో కూడుకున్నదని టీటీడీ చెబుతోంది. అందుకే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమలకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు వస్తుంటే.. కచ్చితంగా వారు రోజువారీ మందులు తెచ్చుకోవాలని సూచించింది టీటీడీ.

ఒకవేళ మెట్ల మార్గాల్లో వచ్చే భక్తులకు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురైతే.. అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం దగ్గర వైద్య సాయం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తిరుమలలో అశ్విని ఆసుపత్రి, ఇతర ఆసుపత్రుల్లో వారం రోజులు 24 గంటలు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు అధికారులు.

Also Read : కూటమి ప్రభుత్వంలో తిరుమలలో అన్నీ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్నాయి- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు