Visakha Sri Sarada Peetham: విశాఖ శారదా పీఠంకు మరో షాక్.. 15రోజులే సమయం..
విశాఖ శారదాపీఠానికి టీటీడీ మరో షాకిచ్చింది. తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని పదిహేను రోజుల్లో ..

Visakha Sri Sarada Peetham
Tirumala: విశాఖ శారదాపీఠానికి టీటీడీ షాకిచ్చింది. తిరుమలలో నిర్మించిన భవనాన్ని పదిహేను రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసుల్లో పేర్కొంది. తిరుమలలోని స్థానిక గోగర్భం డ్యామ్ సమీపంలో విశాఖ శ్రీ శారదా పీఠం భవనం ముందు, వెనుక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. అయితే, గత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్దీకరించింది. అప్పట్లో హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత విశాఖ శారదా పీఠం మఠంకు చెందిన భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా టీటీడీ పాలక మండలి ఆదేశాలతో టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
శారదా పీఠం మఠం నిర్వాహకులు టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై కోర్టును ఆశ్రయించారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతోపాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు శారదా పీఠంకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో మఠం ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని విశాఖ శారదా పీఠంకు టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేసింది.