TTD Hair Auction Revenue : టీటీడీకి తలనీలాల వేలం మీద ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?
భక్తులు హుండీలో వేసే కానుకలతోనే కాదు.. భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు కురుస్తున్నాయి.

TTD Hair Auction Revenue : కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి భక్తులు ఉన్నారు. ఆ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది తిరుమల వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకుని పులకించిపోతారు. తమ జన్మ ధన్యమైందని భక్తి భావంతో తరిస్తారు. భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది.
ఇక తిరుమల శ్రీనివాసునికి వచ్చే హుండీ ఆదాయం గురించి చెప్పక్కర్లేదు. భక్తులు హుండీలో వేసే కానుకలతో భారీగా ఆదాయం వస్తుంది. ప్రతిరోజూ వచ్చే ఆదాయం కోట్లలోనే ఉంటుంది. భక్తులు హుండీలో వేసే కానుకలతోనే కాదు.. భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు కురుస్తున్నాయి. తలనీలాల విక్రయంతో టీటీడీకి ఏటా కోట్లలో ఆదాయం సమకూరుతోంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తప్పకుండా తలనీలాలు సమర్పిస్తుంటారు. వీటి ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం వస్తుంది. ప్రతి ఏటా తలనీలాల వేలం మీద టీటీడీకి ఎన్ని కోట్లు వస్తాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. తలనీలాల వేలం ద్వారా టీటీడీకి ఏడాదికి 176.50 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
Also Read : శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల
తిరుమలకు వచ్చే వారిలో నిత్యం వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. గుండు కొట్టించుకుని స్వామి వారికి మొక్కు చెల్లించుకుంటారు. ఈ జుట్టును టీటీడీ శుభ్రం చేసి వేలం వేస్తుంది. ఈ వేలం ద్వారా టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ వ్యాపారం ప్రపంచంలో బిలియన్ల రూపాయల విలువైనది. ఇందులో భారతదేశం కూడా పెద్ద పాత్ర పోషిస్తోందని చెప్పాలి. ఈ జుట్టును ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ మార్కెట్‌లో ఉపయోగిస్తారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. తలనీలాలను గ్రేడ్ ల వారీగా విభజించి ఈ వేలం వేస్తుంది టీటీడీ.