మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో నమ్మలేని నిజాలు..తాంత్రిక విద్యకు ఆకర్షితురాలైన అలేఖ్య

మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో నమ్మలేని నిజాలు..తాంత్రిక విద్యకు ఆకర్షితురాలైన అలేఖ్య

Updated On : January 30, 2021 / 12:54 PM IST

Madanapalle double murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెలెళ్ల హత్యలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తండ్రి పురుషోత్తమ్ నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతోనే ఇద్దరు కూతుళ్లనూ దారుణంగా హతమార్చారని మొదట అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత…ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార్తె అలేఖ్య వల్లే ఈ దారుణం జరిగిందన్న భావన కలుగుతోంది. భోపాల్‌లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైన అలేఖ్య తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఆ మూఢనమ్మకాల వైపు నడిపించినట్టు తెలుస్తోంది.

భోపాల్ దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో అధికంగా సంచరించే తాంత్రిక మాయగాళ్ల వలలో అలేఖ్య పడినట్టు భావిస్తున్నారు. వారిని తరుచుగా కలుస్తూ తాంత్రిక విద్య పట్ల అలేఖ్య ఆకర్షితురాలైంది. తాంత్రి విద్య నేర్చుకుని పునర్జన్మలపై విశ్వాసం పెంచుకుంది అలేఖ్య. లాక్‌డౌన్‌లో ఇంటికి వచ్చిన ఆమె..కుటుంబ సభ్యులకూ వాటి గురించి అదే పనిగా వివరించి…వారినీ తాంత్రిక విద్యను నమ్మేలా చేసింది.

ఆధ్మాత్మిక భావాలు ఎక్కువగా ఉండే పురుషోత్తమ్ కుటుంబం అలేఖ్య చెప్పే మాటలను తేలిగ్గా నమ్మేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సమయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు అధికంగా చదువుతూ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. పునర్జన్మ, కలియుగం అంతం, సత్యలోకం వంటివాటిపై అపరిమితమైన విశ్వాసం పెంచుకున్నారు. దేవుడు అన్న భావన మీద మితిమీరిన నమ్మకం, దెయ్యాలంటే అలవిమాలిన భయం పురుషోత్తమ్ నాయుడు కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి.

హత్యలకు కొన్నిరోజుల ముందు చిన్నకుమార్తె సాయి దివ్య కుక్కను తీసుకుని వాకింగ్‌కు వెళ్లి ముగ్గులో ఉంచిన నిమ్మకాయను తొక్కడం అనూహ్య పరిణామాలకు దారితీసింది. దేవుళ్లను, దెయ్యాలను విపరీతంగా నమ్మే కుటుంబం కావడంతో…నిమ్మకాయ తొక్కి ఇంటికి వెళ్లిన దగ్గరనుంచి సాయిదివ్యను అనుకోని భయం వెంటాడింది. దెయ్యం పట్టిందేమోనని, చచ్చిపోతానేమోనని భయపడసాగింది. అయితే ఆమె భయాలను పోగొట్టాల్సిన అక్క అలేఖ్య, పునర్జనలపై తనకున్న పిచ్చి నమ్మకంతో చెల్లెలని మరింత ఆందోళనకు గురిచేసింది.

అక్క నమ్మకాలు, చెల్లి భయాలు…తల్లిదండ్రుల విచిత్ర మానసిక పరిస్థితి…హత్యలకు నేపథ్యంగా నిలిచాయి. తాయత్తులు, ప్రత్యేక పూజలతో సాయిదివ్య భయం తొలగిపోలేదు. కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేశానని, దాన్ని చంపి, బతికించానని అలేఖ్య పదే పదే చెప్పడంతో కుటుంబ సభ్యులు నిజమని నమ్మారు. శివుడు తన రూపంలో వస్తున్నాడని, కలియుగంలో చనిపోయి, సత్యలోకంలో పుట్టాలని అలేఖ్య చెప్పే మాటలపై వారికి గురి కుదిరింది. తర్వాత అనర్ధం జరిగిపోయింది.
మొత్తంగా తాంత్రిక విద్యపై అలేఖ్య పిచ్చినమ్మకం తీర్చలేని నష్టానికి కారణమైందన్న ప్రచారం జరుగుతోంది.

తాజాగా పెద్దకుమార్తె అలేఖ్యను చంపేముందు..ఆమె నాలుకను తల్లి పద్మజ కత్తితో కోసివేసినట్టు భావిస్తున్నారు. అలేఖ్య ఆదేశం మేరకే పద్మజ అలా చేసినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టంలో అలేఖ్య నాలుక తెగిపోయి ఉండడాన్ని గుర్తించారు. నాలుక తొలగించుకుని మరణిస్తే…పునర్జన్మ లభిస్తుందన్న నమ్మకంతో అలేఖ్య అలా చేయమని కోరినట్టు తెలుస్తోంది.