Undavalli on Modi: కాంగ్రెస్, బీజేపీ కలిసే ఏపీకి అన్యాయం చేశాయి: మోదీ ‘విభజన’ కామెంట్లపై ఉండవల్లి ఫైర్!

ఏపీ విభజన విషయంలో.. భారత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనంత అన్యాయం జరిగిందని సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Undavalli on Modi: కాంగ్రెస్, బీజేపీ కలిసే ఏపీకి అన్యాయం చేశాయి: మోదీ ‘విభజన’ కామెంట్లపై ఉండవల్లి ఫైర్!

Undavalli

Updated On : February 9, 2022 / 2:22 PM IST

Undavalli on Modi: ఏపీ విభజన విషయంలో.. భారత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనంత అన్యాయం జరిగిందని సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండానే.. ఆ రోజు విభజన ప్రక్రియ పూర్తి చేశారని అన్నారు. డివిజన్ లేకుండానే బిల్లు పాస్ చేశారని చెప్పారు. “బీజేపీ వాళ్లు.. రాజ్యాంగ విరుద్ధంగా మద్దతిచ్చారు కాబట్టే.. ఆ రోజు ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందింది” అని స్పష్టం చేశారు. సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటులో తల్లిలా వ్యవహరిస్తే.. చిన్నమ్మలా మేము సహకరించామంటూ ఆనాడు సుష్మాస్వరాజ్ చేసిన కామెంట్లను.. ఉండవల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజన – తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా పార్లమెంట్ లో చేసిన కామెంట్లను పూర్తి స్థాయిలో తప్పుబట్టారు.. ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ విభజన బిల్లు ఆమోదానికి సంబంధించిన మరిన్ని విషయాలను ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. మోదీ తాజా కామెంట్లపై.. పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందే అని.. అప్పుడే అసలు విషయాలు బయటికి వస్తాయని అన్నారు. ఏపీకి కాంగ్రెస్ మాత్రమే అన్యాయం చేయలేదని.. అందులో బీజేపీ పాత్ర కూడా స్పష్టంగా ఉందని తేల్చి చెప్పారు. బిల్లు పాసైన రోజు.. అసలు ఏపీ సభ్యులకు అభిప్రాయాలు చెప్పే అవకాశమే ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసే.. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.

కాకినాడలోనే.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేశామని చెప్పుకొనే బీజేపీ నేతలు.. గతంలో ఉప ప్రధానిగా అద్వానీ చేసిన కామెంట్లను కూడా పట్టించుకోవాలని అన్నారు. విదర్భ, తెలంగాణ ఏర్పాటుపై వస్తున్న డిమాండ్లకు.. 2001లో అద్వానీ ఇచ్చిన సమాధానం గుర్తు చేసుకోవాలన్నారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే.. రాష్ట్ర శాసనసభ నుంచి తీర్మానం పంపితేనే.. కేంద్రం ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటుందని.. అద్వానీ చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. ఇదీ.. తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరి అని చురకలు అంటించారు. కానీ.. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ లో బిల్లు ఆమోదించినప్పుడు.. బీజేపీ నేతలు ఎందుకు సమర్థించారని ప్రశ్నించారు.

పార్లమెంట్ తలుపులు మూసి ఏపీ విభజన బిల్లు పాస్ అవడానికి బీజేపీ ఎంపీలే కారణమని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. బిల్లుపై చర్చ జరగాల్సిందే అని.. ఓటింగ్ కూడా జరగాలని.. మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని.. ఆనాడు బీజేపీ ఎంపీలు పట్టుబట్టి ఉంటే.. అప్పుడే ఏపీ విభజన ప్రక్రియ ఆగి ఉండేదని తేల్చి చెప్పారు. ఈ తప్పు మామూలుది కాదని.. అత్యంత ఘోరమైన తప్పిదమని.. ఈ విషయం తేలాలంటే.. పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగాల్సిందే అని ఉండవల్లి స్పష్టం చేశారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని.. ఆనాడు చాలా పార్టీలు చెప్పినా.. బీజేపీ వాళ్లు పట్టించుకోలేదని.. వాళ్ల కారణంగానే బిల్లు పాస్ అయ్యిందని ఆరోపించారు.

Read More:

Andhra Pradesh Bifurcation: ఏపీ విభజనలో కాంగ్రెస్ అధికార గర్వమే కనిపించింది: ప్రధాని మోదీ

Harish Rao fire On PM Modi : తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం