Amit Shah : శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికలను దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబికలను దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Amit Shah
Amit Shah visits Srisailam : కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబికలను దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.
అమిత్ షా దంపతులను అధికారులు ఆలయంలోకి తీసుకువెళ్లారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమిత్ షా దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు.
శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంట మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను ఆలయ ప్రాంగణంలో అమిత్ షా నిశితంగా పరిశీలించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ శాసనాలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను అధికారులు అమిత్ షా కు వివరించారు. పశ్చిమ మాడ వీధిలో హోంమంత్రి అర్జున మొక్కలను నాటి నీళ్ళు పోశారు.
తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపెంట చేరుకున్నారు. అమిత్ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుని మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకున్నారు.