చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయి రెడ్డికి లేదు: మండిపడ్డ హోం మంత్రి అనిత
విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని, కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు.

vangalapudi anitha
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడ జిల్లా జైలును పరిశీలించారు. గతంలో జిల్లా జైలులో గంజాయి సరఫరా అవుతుందన్న ఆరోపణలు రావడంతో దాన్ని పరిశీలించేందుకు ఆమె వచ్చారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ… రాష్ట్ర సంపదను జగన్ అండ్ కో దోచుకున్నారని అనిత తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయి రెడ్డిది కాదని అన్నారు. విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని, కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు.
ఆరోపణలపై సమాధానం చెప్పాలని, అంతేగానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిదికాదని అన్నారు. అధికారులను బెదిరించి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని తెలిపారు. పార్టీలకు పోలీసులకు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని, పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని చెప్పారు.
కాకినాడకు పవన్ కల్యాణ్ వెళ్లిన సమయంలో కాకినాడ ఎస్పీ వారం రోజుల నుంచి సెలవులో ఉన్నట్లు తనకు నివేదిక వచ్చిందని తెలిపారు. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి తాను వచ్చానని అనిత అన్నారు.
మౌలిక వసతులపై ఆరా తీశానని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేశానని తెలిపారు. విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని, వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు.