పంచాయతీ ఎన్నికలకు ఆ ఊరు దూరం, సమస్యలు గ్రామంలోనే పరిష్కారం

venkayya peta panchayat poll : పంచాయతీ ఎన్నికలకు ఆ ఊరు దూరం. ఏవైనా సమస్యలుంటే..గ్రామంలోనే పరిష్కారం అవుతుంది. వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఏకగ్రీవమే. రాజకీయ రంగంలో మాత్రం ఈ గ్రామానిది ఓ ప్రత్యేక శైలి. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా సంఘటితంగా ఉంటూ గ్రామ నేతను ఎన్నుకోవడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. ఆ ఊరే..శ్రీకాకుళం జిల్లాలోని వెంకయ్యపేట పంచాయతీ.
గ్రామంలో సుమారు 900 వరకు జనాభా ఉన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులతో పాటు వివిధ రకాల పట్టభద్రులు ఈ గ్రామ కీర్తిని నలుదిశలా పెంచుతున్నారు. పంచాయతీ సర్పంచ్‌గా ఎవరు ఎన్నికైనా గ్రామాభివృద్ధికి పాటు పడుతూ గ్రామానికి సరికొత్త రూపును తీసుకొచ్చేలా కృషి చేస్తుంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ గ్రామం ఇందిరమ్మ ఆదర్శ పంచాయతీగా ఎంపికైంది. అప్పటి నుంచి ఆ గ్రామ స్వరూపం మారింది. 200 పక్కా గృహాలు, 210 పింఛన్లతో పాటుగా పలు సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి. పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నుంచి గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోందని, పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ లేదని మాజీ సర్పంచ్ మావిడి శ్రీను వెల్లడించారు.
2009లో జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను అందించింది. చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా..ఒకే వేదికపై కలుసుకుని గ్రామ సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని, ప్రభుత్వం నిబంధనల ప్రకారం..గ్రామంలోని రిజర్వేషన్ల ప్రకారమే..వ్యక్తులను ఎంపిక చేసుకోవడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఎలాంటి వివాదాలు తాము వెళ్లమని, ఏమైనా సమస్యలుంటే..రామాలయం వద్దే పరిష్కరించుకుంటామని తెలిపారు.