కేశినేని శ్వేత రాజీనామాను ఆమోదించిన విజయవాడ మేయర్

విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత తన మాట నెగ్గించుకున్నారు. కార్పొరేటర్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు.

కేశినేని శ్వేత రాజీనామాను ఆమోదించిన విజయవాడ మేయర్

vijayawada mayor accepted kesineni swetha resignation

Updated On : January 30, 2024 / 12:56 PM IST

kesineni swetha resignation : విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామాకు ఆమోదం లభించింది. కార్పొరేటర్ పదవికి ఇటీవల ఆమె చేసిన రాజీనామాను మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఆమోదించారు. శ్వేత తండ్రి కేశినేని నాని.. టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 8న కార్పొరేటర్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి శ్వేత రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను తాజాగా విజయవాడ నగర మేయర్ ఆమోదించారు. కేశినేని శ్వేత తర్వాతి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా, చంద్రబాబు నాయుడు తమను వద్దనుకున్నారని.. అందుకే తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చిందని రాజీనామా సందర్భంగా కేశినేని శ్వేత అన్నారు. టీడీపీని వీడతామని కలలో కూడా అనుకోలేదని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా తన తండ్రిని అందరూ అభిమానిస్తారని, మూడోసారి ఆయన లోక్ సభలో అడుగు పెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజీనామా చేయడానికి ముందు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో ఆమె భేటీ అయ్యారు. గద్దె రామ్మోహన్ రావును రాజకీయ గురువుగా భావిస్తానని, అందుకే ఆయనను కలిసినట్టు అప్పట్లో చెప్పారు.

మరోవైపు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని వైసీపీ ప్రకటించింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో హాట్రిక్ విజయం సాధించి తనను మెడ పట్టుకుని గెంటేసిన టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. అటు టీడీపీ నాని తమ్ముడు కేశినేని చిన్నిని విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా బరిలో దింపేందుకు రెడీ అవుతోంది. అన్నదమ్ముల పోటీతో విజయవాడలో ఈసారి హోరాహోరీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఎమ్మెల్యే అనిల్‌ ఎవరికి టిక్కు పెడతారో.. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు