Vizag Rushikonda Beach: రుషికొండ బీచ్‌‌కు వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు.. కేవలం వారికి మాత్రమే ఉచితం.. అమల్లోకి ఎప్పటి నుంచి అంటే..?

రుషికొండ బీచ్‌లోని సౌకర్యాల నేపథ్యంలో.. బ్లూఫ్లాగ్ గుర్తింపు రావడంతో సందర్శకుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో బీచ్‌లోకి వచ్చారి నుంచి ఎంట్రీ ఫీజు వసూళ్లు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.

Vizag Rushikonda Beach: రుషికొండ బీచ్‌‌కు వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు.. కేవలం వారికి మాత్రమే ఉచితం.. అమల్లోకి ఎప్పటి నుంచి అంటే..?

Visakhapatnam Beach

Updated On : July 9, 2023 / 12:39 PM IST

Rushikonda Beach Entry Fees: విశాఖపట్టణం (Visakhapatnam) అంటే ముందుగా గుర్తుకొచ్చేది సముద్ర తీరం. అక్కడ రుషికొండ బీచ్‌ (Rushikonda Beach) కు నగరవాసులే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచికూడా పర్యాటకులు నిత్యం వస్తుంటారు. బీచ్‌లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. గతంలో ఈ బీచ్ కు పెద్దగా తాకిడి లేకపోయినప్పటికీ.. బ్లూ ఫ్లాగ్ (Blue Flag) గుర్తింపు రావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఇప్పటి వరకు ఈ బీచ్ సందర్శనకు ఎలాంటి రుసుము వసూళ్లు చేయలేదు. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రుషికొండ బీచ్‌కు వెళ్లే సందర్శకులు ఇకనుంచి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీచ్‌కు వచ్చేవారి నుంచి డబ్బులు వసూలు చేయాలనుకోవటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. బీచ్‌లోకి వెళ్లేవారికి ఎంట్రీ ఫీజు రూ. 20గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పదేళ్లలోపు వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. 11 నుంచి ఎంట్రీ ఫీజు విధానం అమల్లోకి రానుంది.

 

Visakha Rushikonda Beach

Visakha Rushikonda Beach

రుషికొండ బీచ్‌కు సాధారణ రోజుల్లో నిత్యం 5వేల మంది, వారాంతాల్లో రోజుకు 15వేల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ బీచ్‌కు నగరవాసులు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేసేందుకు నిత్యం వస్తుంటారు. ఇక నుంచి వారు వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు చెల్లించాలి. కుటుంబంలో ఐదుగురు సభ్యులు కలిసి బీచ్ కు వెళ్లాలంటే రూ. 100 చెల్లించాల్సిందే. వాహనాల పార్కింగ్ కు కూడా ఫీజు వసూళ్లు చేస్తారని తెలుస్తోంది. ద్విచక్ర వాహనానికి రూ. 10, కారు, జీపులు రూ. 30, బస్సులు రూ. 50 చెల్లించాల్సి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, తాజాగా నిర్ణయం పట్ల నగరవాసుల నుంచి వ్యతిరేఖత వ్యక్తమవుతోంది.

Visakha Rushikonda Beach

Visakha Rushikonda Beach

రుషికొండ బీచ్ కు అంతర్జాతీయ బ్లూఫ్లాగ్ గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. కాలుష్య రహిత, సురక్షిత ప్రమాణాలు, మౌలిక వసతులు మెరుగవడంతో ప్రపంచ పటంలో ఉన్న బీచ్‌లలో రుషికొండ బీచ్ కు ప్రత్యేక స్థానం లభించింది. కేంద్రం దేశంలోని కొన్ని తీర ప్రాంతాలను ఎంపిక చేయగా అందులో రుషికొండ బీచ్ కూడా ఉంది. ప్రస్తుతం బీచ్ బాధ్యతలు ఏపీటీడీసీ పర్యవేక్షిస్తుంది. బీచ్ నిర్వహణ సంస్థకు కష్టతరమవడంతో నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వారికి టెండర్లు ద్వారా ప్రభుత్వం అప్పగించింది. దీంతో  ఈనెల 11 నుంచి బీచ్‌లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు చెల్లింపు అమల్లోకి రానుంది.