vizianagaram Train Accident : రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఘటన స్థలిని పరిశీలించనున్న సీఎం జగన్
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో ఒకే ట్రాక్ పై ముందున్న విశాఖపట్టణం - పలాస రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు ధ్వంసం అయ్యాయి.

vizianagaram train accident
vizianagaram Train Accident Details : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి – ఆలమండ మధ్య ఆదివారం రాత్రి 7గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. అయితే ఇప్పటి వరకు 11 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వంద మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. క్షతగాత్రులకు విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విజయనగరం కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి సుమారు 7గంటల సమయంలో రైలు ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆగిఉన్న విశాఖ – పలాస రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ – రాయగడ రైలు ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని, నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ప్రమాద సమయంలో 1400 మంది..
ఈ ప్రమాదం సమయంలో రెండు రైళ్లలో 1400 మంది వరకు ప్రయాణికులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత వీరి ఆర్తనాదాలు, హాహాకారాలతో ఈ ప్రాంతం మారుమోగింది. సెల్ ఫోన్ల లైట్ల సహాయంతో కొందరు బయటకు రాగా, మరికొందరు బయటకు వచ్చే క్రమంలో గాయపడ్డారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారంతా ఏపీకి చెందిన వారే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం పరిసర ప్రాంతాలకు చెందిన వారే గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
బాలేశ్వర్ ప్రమాదం తరహాలోనే సిగ్నల్ సమస్య ..
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో ఒకే ట్రాక్ పై ముందున్న విశాఖ – పలాస రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ – రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు ధ్వంసం అయ్యాయి. వాటిలో నాలుగు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటన బాలేశ్వర్ ప్రమాదం తరహాలోనే సిగ్నల్ సమస్య కారణంగా జరిగింది. పలాస గార్డు బోగీని రాయగడ రైలు ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జునుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజిను పైకి దూసుకెళ్లాయి. పక్కన గూడ్సు రైలు వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్, గూడ్స్ రైళ్లలో కలిపి ఏడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ట్యాంకర్ గూడ్సు పైకి పలాస రైలుకు చెందిన రెండు బోగీలు దూసుకెళ్లడంతో పట్టాలు పైకిలేచి దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. విశాఖ – రాయగడ రైలులోని వికలాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. దాని వెనుక ఉన్న ఢీ-1 బోగి వేగానికి కొంత భాగం విరిగి పైకిలేచింది.ఘటన స్థలంలో ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అధికారం యంత్రాంగం, రైల్వే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పలువురి సందర్శన ..
రైలు ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ ఎంపీ రామ్మోహన్ రైలు ప్రమాద స్థలిని పరిశీలించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని అన్నారు. బాలేశ్వర్ ఘటన తరువాతకూడా అధికారులు అప్రమత్తం అవ్వలేదని, నెలకో రైలు ప్రమాదం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటన స్థలిని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షణ చేస్తున్నారు.
ఘటన స్థలిని పరిశీలించనున్న సీఎం జగన్..
రైలు ప్రమాద ఘటన స్థలిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో పరిశీలించనున్నారు. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హెల్ప్ లైన్ నెంబర్లు :
విజయనగరం కలెక్టరేట్ : 94935 89157
విశాఖ కలెక్టరేట్ : 90302 26621, 70361 11169, 08912 590102
కేజీహెచ్ : 89125 58494, 83414 83151
వైద్యుడు (24 అందుబాటులో ఉంటారు) : 83414 83151.
అత్యవసర విభాగం వైద్యుడు : 86883 21986
విశాఖ రైల్వే స్టేషన్ లో ..
08912 746330,
08912 744619,
81060 53051,
81060 53052,
85000 41670,
85000 41671,
Bulletin No.01: SCR PR No.558 "Bulletin No.01 Cancellation/Diversion/Short Termination/Partial Cancellation/Rescheduling of Trains" pic.twitter.com/yOhwdvnTMb
— South Central Railway (@SCRailwayIndia) October 30, 2023