Godavari Water Level : ఉగ్ర గోదావరి.. ఏపీలో హైఅలర్ట్, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక
విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ముంపు ప్రాంతంలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. (River Godavari)

godavari water level at bhadrachalam
Godavari – High Alert : గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా గోదావరి ప్రభావిత జిల్లాల అధికారులను అలర్ట్ చేసింది. విపత్తు సంస్థ.. అల్లూరి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది.
ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుంచి ప్రతి గంటకు కూడా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 42 అడుగులు దాటింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి నీటిమట్టం 10 అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతం అయిన అల్లూరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా వరద తాకిడి అవకాశం ఉంది. దాంతో ముంపు ప్రాంతంలోని ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండటంతో మరింత వరద పెరిగే అవకాశం ఉన్నందున కావాల్సిన సదుపాయాలన్నీ బాధితులకు సమకూర్చాలని ఆయా జిల్లాల అధికారులకు విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లా, ఏలూరు జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే పంపించారు. అక్కడి నుంచి పర్యవేక్షణ చేసేలా వారికి ఆదేశాలు ఇచ్చారు. కోనసీమ లంక ప్రాంతాలు ఎక్కువగా నీటమునిగే అవకాశం ఉంది.
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి వరద 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రియాంక. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావొద్దని హెచ్చరించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.