సరిలేరు మీకెవ్వరు.. సొంత ఆలోచనతో ఫారిన్ రేంజ్‌లో వేలాడే వంతెన నిర్మించిన ప.గో.జిల్లా రైతులు

  • Published By: naveen ,Published On : September 13, 2020 / 04:38 PM IST
సరిలేరు మీకెవ్వరు.. సొంత ఆలోచనతో ఫారిన్ రేంజ్‌లో వేలాడే వంతెన నిర్మించిన ప.గో.జిల్లా రైతులు

Updated On : September 13, 2020 / 5:48 PM IST

రెండు ఊళ్లను కలిపే బ్రిడ్జి అది. వంతెన దాటితేనే వరిసాగు చేసుకోవాల్సిన పరిస్థితి. వరదల బీభత్సంతో కీలకమైన బ్రిడ్జి కూప్పకూలింది. ప్రభుత్వం సాయమందించ లేదు.. అధికారులు చొరవ చూప లేదు. కానీ రైతులు మాత్రం బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలెట్టారు. ఔరా అనిపించేలా వంతెన నిర్మించి.. కల సాకారం చేసుకున్నారు. ఇంజనీర్ల ప్రతిభకు ఏమాత్రం తీసిపోని వీరంపాలెం వంతెనపై 10 టీవీ ప్రత్యేక కథనం.

రైతులే ఇంజనీర్లుగా మారి స్వయంగా నిర్మించుకున్న వేలాడే వంతెన:
హ్యాంగింగ్‌ బ్రిడ్జి.. ఇది ఇంజనీరింగ్‌ నిపుణులు రూపొందించిన డిజైన్ కాదు. రైతులే ఇంజనీర్లుగా మారి స్వయంగా నిర్మించుకున్న వేలాడే వంతెన. ఇంజనీరింగ్‌ ప్రతిభకు అద్దంపట్టే హ్యాంగింగ్‌ బ్రిడ్జి నమూనా నుంచి నిర్మాణం వరకు ప్రతీది రైతుల ఆలోచనల నుంచి పుట్టినవే. రైతంటే దేశానికి అన్నం పెట్టడమే కాదూ.. అద్భుతమైన ఆలోచనల సమాహారం అని చాటి చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్.

ఎర్రకాలువకు అవతలి పక్కన పంటపొలాలు:
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం-త్యాజంపూడి గ్రామాల మధ్యనున్న ఎర్ర కాలువ వంతెన ఇది. ఊళ్లో చాలామంది రైతులకి ఎర్రకాలువ అవతలి పక్కన పంటపొలాలు ఉన్నాయి. సాధారణంగా ఎర్రకాలువ నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. గతంలో కొందరు ఈ కాలువ దాటుతూ ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఎర్రకాలువ పొంగి గట్లు తెగి పొలాలను ఇసుక కప్పేయడంతో రైతులు చాలా నష్టపోతుంటారు. వ్యవసాయ పనులకు వెళ్ళి తిరిగి సాయంత్రం ఇల్లు చేరేవరకూ ఇంటి దగ్గర వాళ్ళు భయంతో ఎదురు చూస్తుంటారు. దశాబ్దాల ఎదురుచూపులు, రాజకీయ ప్రయత్నాల తర్వాత ఓ బ్రిడ్జి నిర్మించారు. కానీ అది వరద బీభత్సానికి నిలువలేక పేకమేడలా కుప్పకూలింది.

ఎవర్నీ నమ్ముకోవద్దని డిసైడైన రైతులు:
బ్రిడ్జి పునర్నిర్మాణానికి రైతులంతా బాగానే ప్రయత్నాలు చేశారు. అధికారుల చుట్టూ తిరిగారు. రాజకీయ నేతల్ని కలిశారు. కానీ ఫలితం లేకుండాపోయింది. వాళ్లనీ వీళ్లనీ నమ్ముకుంటే పనులు కావని గ్రహించిన రైతులు.. బ్రిడ్జి నిర్మాణం ఎలా చేయాలా అని బుర్రకు పదునెట్టారు. అప్పుడు మెరిసిన ఆలోచనే ఇది.

సిమెంట్‌, ఇటుక, కంకర ఇవేవీ వద్దు.. హ్యాంగింగ్‌ వంతెన అయితేనే బెటర్‌ అని డిసైడ్ అయ్యారు. తలాకొంత అమౌంట్ సర్దుబాటు చేసుకున్నారు. అందమైన వంతెన కోసం ఓ ఫైన్‌డే అంకురార్పణ చేశారు. సంకల్ప బలం ఉంటే కానిదేం ఉంటుంది. తక్కువ వ్యవధిలోనే హ్యాంగింగ్‌ బ్రిడ్జి రెడీ అయిపోయింది.

పట్టుదలతో బ్రిడ్జిని పూర్తి చేసిన రైతులు:
పై నుంచి నడిస్తే కిందపడిపోకుండా ఐరన్‌ మెష్‌లు ఏర్పాటు చేశారు. నాణ్యమైన వైర్‌లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం నుంచి సాయం ఆశించకుండా సొంతగా ఆర్థిక వనరులు సమకూర్చుకున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సహాయంతో రైతులే ఇంజనీర్లుగా మారి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు.

రైతుల పట్టుదలకి, స్వయంకృషికి ఈ బ్రిడ్జి ఓ నిదర్శనంగా నిలిచింది. బ్రిడ్జి నిర్మాణంతో రైతులు ఎంచక్కా తమ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ నీళ్లలో ఈదుతూ.. అష్టకష్టాలు పడ్డారు. ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో హ్యాపీగా వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్నారు.