ఆ ఆరుగురు మాజీ మంత్రులపై చర్యలు తప్పవా.. అధికారుల పాత్ర ఎంత.. ప్రజాప్రతినిధులు దోచినదెంత?
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం ప్రభుత్వం ఎలాంటి వేటు వేస్తుందని టెన్షన్ పడుతున్నారట.

వైసీపీ నేతలకు అరెస్ట్ భయం పట్టుకుందా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఇప్పుడు తోడుతున్నారా.. మాజీ మంత్రుల అరెస్ట్‌కు ఉచ్చు బిగుస్తున్నారా.. అసైన్డ్‌భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయా.. రెవెన్యూ శాఖ నివేదిక.. వైసీపీ నేతలకు వణుకుపుట్టుస్తుందా.. రెవెన్యూ శాఖ రిపోర్ట్ ఆధారంగా కూటమి సర్కార్ యాక్షన్ తప్పదనే గాసిప్ ప్రచారం జోరందుకుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలకు అరెస్ట్ భయం పట్టుకుందని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను వెతికే పనిలో పడింది కూటమి సర్కార్. ఏ నాయకుడు ఏ చిన్న తప్పు చేసినట్టు ఆధారం దొరికినా వదిలిపెట్టడం లేదు. కూపీలాగి జైల్లో కూర్చొబెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి విచారణకు రావాలని నోటీసులిచ్చారు. ఇప్పుడు మరో ఆరుగురు మాజీ మంత్రులకు కూడా ఉచ్చు బిగుసుకునేలా ఉందని పొలిటికల్ సర్కిళ్లలో బలమైన టాక్ వినిపిస్తోంది.
భయంకరమైన నిజాలు బయటపడ్డాయా?
ఏపీ రెవెన్యూ శాఖ నివేదికలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయని ప్రచారం జరుగుతోంది. అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణల కేసుల్లో ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని నిగ్గుతేల్చింది రెవెన్యూశాఖ. వీళ్లే కాకుండా 120 మంది వైసీపీ నేతల పాత్ర ఉందని రెవెన్యూ శాఖ రిపోర్ట్ చెబుతోంది.
గత గవర్నమెంట్ హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి.. జరిగిన భూదందాల్లో ఏ మంత్రి పాత్ర ఎంత.. వైసీపీ నేతలెవరు కీలక పాత్ర పోషించారు.. మదనపల్లె ఆఫీసు-ఫైళ్ల దహనం సూత్రధారులెవరు.. పాత్రధారులెవరు.. ఆ ప్రాంతంలో అసైన్డ్, ఇతర భూములను చేజిక్కించుకుని లబ్ధి పొందిన రాజకీయ నేతలెవరు.. వారికి కొమ్ముగాసి అవినీతి, అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన అధికారులెవరు.. ఇందులో రెవెన్యూ యంత్రాంగం పాత్రేంటో రెవెన్యూ శాఖ మొత్తం బయటపెట్టిందని పొలిటికల్ సర్కిళ్లలో తెగ ప్రచారం జరుగుతోంది.
వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు సమగ్ర నివేదికలను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించిందట రెవెన్యూ శాఖ. ఇప్పుడు కూటమి సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లోనే గాక అధికార వర్గాల్లోనూ టెన్షన్ మొదలైంది. రెవెన్యూ శాఖ రెడీ చేసిన రిపోర్ట్‌లో పొలిటికల్ లీడర్ల ప్రమేయం మాత్రమే కాదు అధికారులు కూడా సపోర్ట్ చేశారంటూ రెవెన్యూ శాఖ నిగ్గుతేల్చింది. 22మంది డిప్యూటీ కలెక్టర్లు, 48మంది తహసీల్దార్లు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టం చేసింది.
కుట్రపూరితంగా నిప్పు
వాస్తవానికి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నెలన్నర రోజులకే 2024 జూలై 22న ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు కొందరు దుండగులు కుట్రపూరితంగా నిప్పుపెట్టారు. ఇందులో కీలకమైన భూరికార్డులు కాలిపోయాయి. ఈ ఉదంతంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. మరోవైపు రెవెన్యూ శాఖ అంతర్గత విచారణ చేపట్టింది.
డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో విచారణ బృందాలు ఎక్కడికక్కడ అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కూపీలాగారు. రాష్ట్ర వ్యాప్తంగా 13లక్షల 59 వేల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయగా.. అందులో 5.74 లక్షల ఎకరాలు మాయమైనట్లు బయటపడింది. 25 వేల ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయగా, అందులో 8వేల 4వందల 83 ఎకరాలు ఆక్రమించారని నిగ్గు తేల్చారు.
ప్రభుత్వ, అసైన్డ్ భూములు కాజేసిన వారిపై భూముల ఆక్రమిత చట్టం-1905 కింద క్రిమినల్ కేసులు పెట్టాలని రెవెన్యూశాఖ ప్రభుత్వానికి నివేదిక చేరవేసిందని ప్రచారం జరుగుతోంది. సదరు ఫైల్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉందట. ఈ ఆక్రమణలపై విషయంలో సీఎం చంద్రబాబు ఇచ్చే ఆదేశాల కోసం రెవెన్యూ శాఖ ఎదురుచూస్తోంది.
దీంతో భూదందా అక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులతో పాటు, ప్రజాప్రతినిధులకు భయం పట్టుకుందని పొలిటికల్ సర్కిళ్లలో గాసిప్ చక్కర్లు కొడుతుంది. ఇటు ప్రభుత్వం ఎలాంటి వేటు వేస్తుందోనని… ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం టెన్షన్ పడుతున్నారట.