YS Jagan Mohan Reddy : జైల్లో చంద్రబాబు.. మరోసారి సీఎం అయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి

టీడీపీని కేసుల భయం వెంటాడుతున్న సమయంలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు సీఎం జగన్. CM Jagan Master Plan

YS Jagan Mohan Reddy : జైల్లో చంద్రబాబు.. మరోసారి సీఎం అయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి

CM Jagan Master Plan

CM Jagan Master Plan : ఏపీలో 2024 ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కేసులు చుట్టూ తిరుగుతుంటే.. అధికార పార్టీ మాత్రం మరోసారి విజయం సాధించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఓటు బ్యాంకు బలోపేతం చేసుకునేందుకు అధికార పార్టీ ఏం ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. టీడీపీ కేసుల్లో ఉన్న సమయంలోనే పాజిటివ్ ఓటును పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ను తగ్గించుకునేందుకు వైసీసీ సిద్ధం చేస్తున్న వ్యూహాలేంటి?

ఏపీలో తెలుగుదేశం పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కష్టపడుతున్న సమయంలోనే చంద్రబాబు అరెస్ట్ కావడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. మరోవైపు లోకేశ్ తో పాటు పలు కేసుల్లో ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో డిఫెన్స్ లో పడిన పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఓవైపు సెంటిమెంట్ పై ఆశలు పెట్టుకోవడంతో పాటు కేసుల నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ.

Also Read..TDP Strategy: టీడీపీ ముందున్న ఏకైక మార్గం అదేనా.. వారిద్దరినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తారా?

టీడీపీని కేసుల భయం వెంటాడుతున్న సమయంలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు సీఎం జగన్. పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ నే నమ్ముకున్న జగన్.. అదే తమకు మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందని భావిస్తున్నారు. తన పాలనతో ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు మిగిలి ఉన్న 6 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ ఓటు బ్యాంకు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. చాప కింద నీరులా సైలెంట్ గా వివిధ కోణాల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు జగన్.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసీపీలో క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగలిగి, వివిధ కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను సంతృప్తి పరిచేందుకు విస్తృతస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీకున్న ఓటు బ్యాంకును పకడ్బందీగా పోలింగ్ బూత్ లకు మళ్లించడంతో పాటు టీడీపీ, జనసేన నేతలను క్షేత్రస్థాయిలో ఢీకొట్టాలంటే ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర కీలకం అనే విషయాన్ని వైసీపీ నాయకత్వం గుర్తించింది. నియోజకవర్గాల స్థాయిలో చాలా చోట్ల అసంతృప్తి ఉందన్న విషయాన్ని గుర్తించింది వైసీపీ అధిష్టానం.

వీరికి పార్టీ అధినేత జగన్, పార్టీ పట్ల అభిమానం ఉన్నా తమ పైస్థాయి నాయకులతో వివిధ కారణాల వల్ల విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలను చక్కదిద్ది వారంతా పార్టీ కోసం జగన్ కోసం పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలకు ఉపక్రమించింది వైసీపీ నాయకత్వం. ఈ దిద్దుబాటు చర్యలు చడీచప్పుడు లేకుండా సాగిపోతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో తమ స్టామినాను పెంచుకునే దిశగా ముందుకెళ్తోంది. సెంటిమెంట్ అస్త్రాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ స్టామినా ఉపయోగపడుతుందని భావిస్తోంది వైసీపీ.

2019 ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు, 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. అభివృద్ది, సంక్షేమ ఎజెండాతో ముందుకు సాగుతోంది. నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన హామీల్లో 98.5శాతం అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది వైసీపీ. సంక్షేమంలో మహిళలకే అగ్రస్థానం కల్పించడంతో పాటు ప్రతీ పథకంలో మహిళలనే లబ్దిదారులుగా చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫలితంగా ప్రతి ఉపఎన్నికతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది.

Also Read..Pawan Kalyan: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు జగన్. ఈ విషయమై పార్టీ శ్రేణులకు పదే పదే సంకేతాలు కూడా ఇస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేశారు జగన్. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు దిశగా ముందుకెళ్తున్నా.. సీఎం జగన్ ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా గ్రామాలపైన ఫోకస్ చేశారు జగన్. సంక్షేమ పథకాలు, సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే కేంద్రాలు, నాడు-నేడు, హెల్త్ సెంటర్లు వంటి నిర్ణయాలతో గ్రామీణ, పట్టణ ఓటర్లను ఆకట్టుకున్నట్లు పలు సర్వేలు తేల్చాయి.

నిత్యం ప్రజల్లోనే ఉండాలని ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలను ఆదేశించారు జగన్. అంతేకాదు టీడీపీ, జనసేన పొత్తును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవసరమైన చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల తర్వాత పల్లెకు పోదాం పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఏపీ సీఎం జగన్. దీని ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో పథకాల లబ్దిదారులతో పార్టీ నేతలు మమేకం కానున్నారు.

ఈ సమయంలో పథకాలు అందని అర్హులకు అవకాశం కల్పించడంతో పాటు పార్టీకి మద్దతు తెలిపేలా అవసరమైన చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. టీడీపీ, జనసేన కలిసి జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నా, తెలుగుదేశం మాత్రం ఇంకా కేసుల చుట్టూనే తిరుగుతోంది. ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జగన్ ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవడంతో పాటు టీడీపీ-జనసేన అనుకూల ఓట్లను తమవైపు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.