కాకాణి అరెస్ట్ తప్పదా.. విచారణకు అందుకే డుమ్మానా?
ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్‌తోపాటు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి

Kakani Govardhan Reddy
వైసీపీ నేతలు పోలీసులకు చిక్కకుండా దొంగా పోలీసుల ఆటకు తెరతీశారా.. విచారణకు పిలవగానే అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోతున్నారా? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు అందుబాటులోకి రాకపోవడానికి రీజన్ ఏంటి? మైనింగ్ మరకల వెనుక కాకాణి కహానీ ఏంటి?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలకు అరెస్ట్ భయం పట్టుకుందని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చేసిన తప్పుల చిట్టా పుస్తకాలను బయటకు తీసి దుమ్ముదులుపుతోంది కూటమి సర్కార్. ఏ నాయకుడు ఏ చిన్న తప్పు చేసినట్టు ఆధారం దొరికినా వదిలిపెట్టడం లేదు.
కూపీలాగి జైల్లో కూర్చొబెడుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి మొన్న పోసాని కృష్ణమురళి వరకు ఇదే తంతూ జరిగింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వంతు వచ్చేసింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. కేసు ఫైల్ అయింది.
క్వార్ట్‌ను అక్రమంగా తరలించారని వివాదం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్‌ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ గని లీజు కాలం ముగిశాక కూడా.. వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాక రాళ్ళను పేల్చేందుకు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని పెద్ద ఇష్యూ అయింది.
ఈ విషయంపై అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైన్ దగ్గరే నిరసన దీక్ష చేపట్టారు. పేలుడుకు వాడే జిలేటెన్ స్టిక్స్‌తో పాటు పేలుడు పదార్థాలను అధికారులకు అప్పగించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా స్పందన లేదని.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దాంతో వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్పట్లో కేంద్రం ఆదేశించింది. అప్పటి నుంచి గనిలో మైనింగ్ యాక్టివిటీ తగ్గింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..ఈ అక్రమ మైనింగ్‌పై మరోసారి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసలు విచారణ జరిపి ఏడుగురిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడానికి నెల్లూరులోని కాకాణి నివాసానికి ఆదివారం పోలీసులు వెళ్లారు. కానీ కాకాణి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు పేర్కొన్నారు.
ఎక్కడికీ పారిపోలేదంటూ పోస్టు
అయితే కాకాణి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ భయంతో పారిపోయారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. దీంతో కాకాణి సోషల్‌మీడియాలో ప్రత్యక్షమై తాను ఎక్కడికీ పారిపోలేదంటూ ఓ పోస్టు పెట్టారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. కుటుంబ సభ్యులతో కలిసే ఉన్నానని సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పోస్టు చేశారు.
వెంటనే పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లాగా.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా కాకాణి లేరని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన సమీప బంధువుకు మళ్లీ నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీస్‌లో కాకాణి హాజరుకావాల్సి ఉందంటూ నోటీసులో పేర్కొన్నారు.
ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్‌తోపాటు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. మంగళవారం హైకోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు, నెల్లూరుతో పాటు హైదరాబాద్ లో కూడా కాకాణి లేకపోవడంతో.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. తనపై తప్పుడు కేసు పెట్టారని ఇప్పటికే ఆరోపించిన కాకాణి ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆయన రెండుసార్లు అందుబాటులో లేరు. మరి పోలీసుల నోటీసులపై కాకాణి ఎలా స్పందిస్తారు. మంగళవారమైనా విచారణకు హాజరవుతారా.. లేదా అన్న ఉత్కంఠ మొదలైంది.