Tadikonda constituency: అసెంబ్లీ సీటుపై కన్నేసిన నందిగం సురేశ్.. తాడికొండలో ఈసారి వైసీపీ అభ్యర్థి ఎవరో?

బాపట్ల ఎంపీగా గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సురేశ్.. ఈ సారి అసెంబ్లీపై కన్నేశారు. సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.

Tadikonda constituency: అసెంబ్లీ సీటుపై కన్నేసిన నందిగం సురేశ్.. తాడికొండలో ఈసారి వైసీపీ అభ్యర్థి ఎవరో?

Dokka Manikya Vara Prasad, Nandigam Suresh

Updated On : August 4, 2023 / 3:07 PM IST

Tadikonda Assembly constituency: ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతంలో కీలక నియోజకవర్గం తాడికొండ. పూర్తిగా అమరావతి ప్రాంతంలో ఉన్న తాడికొండ రాజకీయం మంచి కాకమీద కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌కు ప్రతిష్టాత్మకమైన ఈ సీటులో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అలా గెలిచిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) శాసనమండలి ఎన్నికల్లో ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. ఆమెపై బహిష్కరణ వేటు వేసిన వైసీపీ ప్రత్యామ్నాయం రెడీ చేసిందా? బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ (Nandigam Suresh) ఈ సారి తాడికొండలో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమరావతి ప్రాంతంలో వైసీపీ తెరవెనుక రాజకీయం ఎలా ఉంది?

అమరావతి ప్రాంతంలోని కీలక నియోజకవర్గం తాడికొండ. పూర్తిగా రాజధాని పరిధిలోని గ్రామాలే ఉన్న తాడికొండ రాజకీయం కొద్దికాలంగా హాట్‌ హాట్‌గా మారింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి సంచలనం సృష్టించింది వైసీపీ. కొత్త రాజధాని నిర్మిస్తున్నామని.. ఇక్కడ గెలుపు ఈజీ అనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు ఝలక్ ఇచ్చారు తాడికొండ ఓటర్లు.. అయితే ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే.. నాలుగేళ్ల తర్వాత సొంతపార్టీ వైసీపీకి హ్యాండివ్వడంతో ఇక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. రాజధాని వ్యతిరేక, అనుకూల ప్రకటనలతో నిత్యం వార్తల్లో ఉండే తాడికొండలో ఈ సారి ఎలాగైనా గెలవాలనేది వైసీపీ టార్గెట్. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీకి దూరం కావడంతో ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టింది వైసీపీ.

Also Read: రాజకీయ యుద్ధంలో చిక్కుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్!

ఎమ్మెల్యే శ్రీదేవి వైసీపీలో ఉండగానే.. ఆమెపై వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్కవరప్రసాద్‌ (Dokka Manikya Vara Prasad) కు సమన్వయకర్తగా నియమించారు సీఎం జగన్ (CM Jagan). శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో చాన్స్ లేదని చెప్పిసినట్లు ప్రచారం జరిగింది. ఆ కారణంగానే ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని భావిస్తోంది వైసీపీ. ఈ పరిణామంతో శ్రీదేవి పార్టీ వీడినా.. ఆమె స్థానంలో నిలపాలని అనుకున్న ఎమ్మెల్సీ డొక్కాకు బదులుగా.. ఎంపీ నందిగం సురేశ్ పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సమాచారం. బాపట్ల ఎంపీ (Bapatla MP) గా గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సురేశ్.. ఈ సారి అసెంబ్లీపై కన్నేశారు. సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ది పక్కనే ఉన్న ప్రత్తికొండ నియోజకవర్గం. కనుక స్థానికుడిగా తాను పోటీ చేస్తేనే గెలుస్తాననేది ఎంపీ సురేశ్ ప్రతిపాదనగా చెబుతున్నారు.

Also Read: అందుకే నేను పవన్ కల్యాణ్ గురించి ఇలా మాట్లాడుతున్నాను: అంబటి రాంబాబు

మూడు రాజధానులకు జనామోదం ఉందని నిరూపించాలంటే తాడికొండలో గెలిచి తీరాలని అనుకుంటోంది వైసీపీ. అందుకే రాజధాని నినాదంతోనే పోటీచేసి గెలవాలని కోరుకుంటోంది. అందుకు ఎంపీ నందిగం సురేశ్ అయితేనే కరెక్ట్ అనేది వైసీపీలోని ఓ వర్గం నమ్మకం. కానీ, సీఎం జగన్ మదిలో ఏముందో అదే ఫైనల్. జగన్‌కు వీరవిధేయుడైన ఎంపీ సురేశ్ పార్టీని ధిక్కరించే పరిస్థితి లేదు. కనుక తాడికొండలో ఈ సారి ఎవరు పోటీ చేస్తారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచే పోటీ చేసేలా తెరవెనుక చక్రం తిప్పుతున్నారు ఎంపీ సురేశ్. ఇక పార్టీ ఏది డిసైడ్ చేస్తుందో? ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌కు ఎలా న్యాయం చేస్తారో చూడాల్సిందే.