ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే? కేటాయించే శాఖలు ఏవి?

టీడీపీ, బీజేపీ నుంచి కేబినెట్ మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తుండగా.. మరికొందరికి సహాయ మంత్రుల పదవులు దక్కే చాన్స్ కనిపిస్తోంది.

ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే? కేటాయించే శాఖలు ఏవి?

Updated On : June 8, 2024 / 9:50 PM IST

Modi Cabinet : ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించేది ఎవరు? ఎన్డీయే సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిన ఏపీకి ఎలాంటి ప్రాధాన్యత దక్కనుంది? ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు? ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు? రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏపీ నుంచి ఎన్డీయే కూటమి తరుపున 21మంది ఎంపీలు ఎన్నికవగా వీరిలో ఆరేడు మంది కేంద్ర మంత్రులు అయ్యే ఛాన్స్ ఉంది.

టీడీపీ, బీజేపీ నుంచి కేబినెట్ మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తుండగా.. మరికొందరికి సహాయ మంత్రుల పదవులు దక్కే చాన్స్ కనిపిస్తోంది. రేపు ఢిల్లీలో ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న మోదీ.. తన జట్టులో ఎవరిని చేర్చుకుంటున్నారు? ”కేంద్ర మంత్రులు వీళ్లేనా?”.. స్పెషల్ అనాలసిస్..

కేంద్ర మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరి పేర్లే ఎందుకు పరిశీలనలోకి వచ్చాయి? కారణాలు ఏంటి? మొత్తం లోక్ సభ సభ్యుల సంఖ్య 545. ఇందులో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను పక్కన పెడితే.. 543 మంది సభ్యులు ఉన్న లోక్ సభలో 15శాతం మందికి మాత్రమే కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కల్పించే చాన్స్ ఉంది. ఈ విధంగా చూస్తే మోదీ మంత్రివర్గంలో అటు కేబినెట్, ఇటు సహాయ మంత్రులు కలిసి కేవలం 81 మందికి మాత్రమే ఛాన్స్ ఉండబోతోంది.

ఈసారి బీజేపీతో పాటు ఎన్డీయే ఏర్పాటులో టీడీపీ, జేడీయూ, లోక్ జన శక్తి, జనసేన, జేడీఎస్ లాంటి పార్టీలో కీలకంగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు కొంత ఆసక్తి రేపుతోంది. అయితే, ఏపీ విషయానికి వస్తే కూటమి నుంచి 21మంది ఎంపీలు గెలుపొందారు. టీడీపీ నుంచి 16మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు గెలుపొందారు. మొత్తంగా చూసుకుంటే.. 25 ఎంపీ స్థానాల్లో 21మంది ఎంపీలు ఎన్డీయే నుంచే ఉన్నారు. వాళ్లలో టీడీపీకి ప్రాతినిధ్యం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉండి ఎన్డీయేలో కీలకంగా ఉన్న జనసేనకు ఒక బెర్త్ దక్కే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. అందులో పురంధేశ్వరి లాంటి సీనియర్ నేత ఉన్నారు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్ లాంటి నేతలు ఉన్నారు కాబట్టి.. వారిలో ఒకరికి ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్తులు ఎవరికి దక్కే అవకాశం ఉంది? టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి పరిశీలనలో ఉన్న పేర్లు ఏవి? 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..

16మంది ఎంపీలు ఉన్న టీడీపీకి కచ్చితంగా 3 కేబినెట్ బెర్తులు, 2 సహాయ మంత్రులు.. లేదంటే 2 కేబినెట్ బెర్తులు, 2 సహాయ మంత్రి పదవులు లభించే ఛాన్స్ ఉంది. టీడీపీ కీలక శాఖలు అడుగుతున్నట్లు సమాచారం. కేంద్ర జల్ శక్తి, ఐటీ కమ్యూనికేషన్స్, షిప్పింగ్, పట్టణాభివృద్ధి లాంటి కీలక శాఖలను టీడీపీ అడుగుతున్నట్లు సమాచారం. పోర్ట్ ఫోలియోలు ఏవి ఇస్తారు? అనేది ఒక ఆసక్తికర అంశం అయితే.. ఎంతమందికి కేబినెట్ లో అవకాశం దక్కబోతోంది అన్నది అత్యంత కీలకం.

తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్రమంత్రి పదవుల పరిశీలనలో ఉన్న పేర్లు..
కింజరాపు రామ్మోహన్ నాయుడు – వరుసగా మూడుసార్లు ఎంపీగా విజయం, విద్యావంతుడు
దగ్గుమళ్ల ప్రసాదరావు- రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, విశేష పాలనా అనుభవం, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన అనుభవం, రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్, నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర
పెమ్మసాని చంద్రశేఖర్ – స్వచ్చంద సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్ఆర్ఐ.. టీడీపీ, చంద్రబాబుపై పూర్తి విధేయత, ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ వైద్యుడు
లావు శ్రీకృష్ణదేవరాయలు – వరుసగా రెండోసారి ఎంపీగా విజయం.. సౌమ్యుడు, ఉన్నత విద్యావంతుడు, రాజకీయాల్లో అవినీతి మచ్చలేని చరిత్ర, విజ్ఞాన్ విద్యాసంస్థల ద్వారా గుర్తింపు
గంటి హరీశ్ మాధుర్ – లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి తనయుడు
బైరెడ్డి శబరి – బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం.. యువత, మహిళా కోటాలో ఎంపికయ్యే ఛాన్స్

జనసేన నుంచి పరిశీలనలో ఉన్న పేరు..
వల్లభనేని బాలశౌరి – 3సార్లు ఎంపీగా గెలుపు, కీలకమైన కాపు సామాజికవర్గ నేపథ్యం, సౌమ్యుడు వివాదరహితుడిగా గుర్తింపు, జనసేన కోటాలో తప్పనిసరిగా ఛాన్స్ దక్కే అవకాశం

బీజేపీ నుంచి పరిశీలనలో ఉన్న పేర్లు..
దగ్గుబాటి పురంధేశ్వరి – సీనియర్ నేత, రాజకీయ కుటుంబ నేపథ్యం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా విజయంలో కీలక పాత్ర
సీఎం రమేశ్ – జాతీయ స్థాయిలో బీజేపీ ముఖ్య నేతలతో విస్తృత సంబంధాలు.. టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు, సమన్వయంలో కీలక పాత్ర, గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన అనుభవం

Also Read : కేంద్ర క్యాబినెట్‌లో ఈ శాఖలు తీసుకుంటే ఏపీకి తిరుగుండదు..! – చంద్రబాబు, పవన్‌కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన