టీటీడీ చైర్మన్ పదవిని అశోక్ గజపతిరాజు వద్దనుకోవడానికి కారణం అదేనా?
కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఆఫర్ చేస్తే గవర్నర్‌గా పనిచేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు.

ఎవరికైనా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ పదవి అవకాశం వస్తే ఏం చేస్తారు…? ఎగిరి గంతేస్తారు. ఆ తిరుమల వెంకన్నకు సేవ చేసే భాగ్యం కలిగిందని మహదానందం పడతారు. కానీ, టీడీపీలో కీలక నేత మాత్రం నాకొద్దంటూ పక్కకు తప్పుకున్నారట… టీటీడీ చైర్మన్ పదవే కాదు.. సభ్యుడిగా అవకాశం కావాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటే… ఈ సీనియర్ లీడర్ రివర్స్‌లో ఎందుకు ఆలోచించారు? ఏంటా కథ…
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే టీటీడీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తన బాధ్యతలు స్వీకరించడానికి ముందు తిరుమల వెంకన్నను దర్శంచుకున్న చంద్రబాబు… టీటీడీ ప్రతిష్ట పెంచేలా తొలి అడుగు వేశారు. ఈవోను బదిలీ చేసి కొత్త ఈవోను నియమించారు. అదేసమయంలో తిరుమల పాలక మండలిని కొత్తగా నియమించాలని.. కొందరు నేతల పేర్లును పరిశీలిస్తున్నారు.
టీటీడీ చైర్మన్ పదవి కోసం టీడీపీలో చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ లీడర్.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న అశోక్ గజపతిరాజు ఐతేనే తిరుమల ప్రతిష్ఠ పెరుగుతుందని… ప్రభుత్వంపైనా మంచి ఇమేజ్ ఉంటుందని భావించారట సీఎం చంద్రబాబు. కానీ, చంద్రబాబు ప్రతిపాదనకు అశోక్ తిరస్కరించినట్లు జరుగుతున్న ప్రచారమే ఆసక్తికరంగా మారింది.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని..
ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న అశోక్ టీటీడీ చైర్మన్ పదవిని వద్దనుకోవడం ఏంటని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 1978లో రాజకీయాల్లో ప్రవేశించిన అశోక్ గజపతిరాజు.. సీఎం చంద్రబాబుతో సమకాలీన రాజకీయాలు చేశారు. అశోక్ అంటే సీఎం చంద్రబాబుకు కూడా ప్రత్యేక గౌరవం.
అశోక్ కావాలంటే టీడీపీలో ఏ పదవి అయినా ఆయన ముందు వాలిపోతుంది. కానీ, పార్టీ ఇస్తామన్న పదవిని సైతం ఆయన వద్దనుకోవడమే చర్చకు తావిస్తోంది. సుమారు 45 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న అశోక్‌గజపతిరాజు ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని వద్దనుకోవడానికి కూడా ఇదే కారణమా? అన్న చర్చ జరుగుతోంది.
మరోవైపు విజయనగరం సంస్థానాదీసుడుగా, మాన్సస్ సంస్థల చైర్మన్‌గా ఉన్న అశోక్‌గజపతిరాజు ఉత్తరాంధ్రలో 108 దేవాలయాలకు అనువంశిక ధర్మకర్త. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంతోపాటు ఉత్తరాంధ్రలోని ప్రతిష్ఠాత్మక దేవాలయాలైన రామతీర్థం, సింహాచలం ఆలయాలకు అశోక్ గజపతిరాజు చైర్మన్.
పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా అశోక్ ఆధ్వర్యంలోనే ఆయా ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించాల్సివుంటుంది. ఈ కారణం కూడా టీటీడీ చైర్మన్ అవకాశాన్ని వద్దనుకోవడానికి ఓ కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ చైర్మన్ అంటే అదో ప్రొటోకాల్ పదవి. కోట్ల రూపాయల నిధులు, హైందవ ధర్మం విస్తృతికి కృషి చేసే అవకాశం ఉంటుంది.
కానీ, అశోక్ వయసు, ఇతర బాధ్యతల వల్ల ఆ పదవికి న్యాయం చేయలేనని నిర్ణయించుకున్నారట. టీటీడీ చైర్మన్‌గా ఎక్కువ కాలం తిరుమలలో ఉండాల్సివుంటుంది. వీవీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండే తిరుమలలో తన ప్రొటోకాల్ కూడా అడ్డు పడకూడదనే ఉద్దేశమే అశోక్ టీటీడీ చైర్మన్ గిరీని వద్దను కోడానికి ఓ కారణంగా చెబుతున్నారు.
ఆయనకు సరిపడని అంశమా?
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిరుమలకు వచ్చినప్పుడల్లా వీవీఐపీ ఆహ్వానం వంటి కఠినమైన ప్రోటోకాల్‌ను పాటించాలి. దర్శనం కోసం చైర్మన్ వీవీఐపీలతోపాటు ఆలయంలోకి వెళ్లాలి. వారికి ప్రోటోకాల్ ప్రకారం అన్ని సౌకర్యాలు అందేలా చూడాలి. ఇవన్నీ చేయాలంటే అశోక్ గజపతి వంటి వ్యక్తులకు సరిపడని అంశంగా పరిగణిస్తున్నారు.
ఎప్పుడూ రాచ ఠీవితో ఉండే అశోక్ గజపతిరాజు… నిత్యం స్వామివారి సేవతో పాటు… అటు కఠిన ప్రోటోకాల్ లో ఉండాలంటే అతని స్వభావానికి కుదరని పని. ఇవన్నీ ఆలోచించే టీటీడీ చైర్మన్ పదవిపై తనకు ఆసక్తి లేదని చెప్పారని సమాచారం. ప్రస్తుతం అశోక్ ఆరోగ్యం, వయస్సు రీత్యా…. మనశ్శాంతి, గౌరవం ఉండే పదవిని కోరుకుంటున్నారట… కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఆఫర్ చేస్తే గవర్నర్‌గా పనిచేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. మరి అశోక్ ఆశిస్తున్నట్లు గవర్నర్ గిరీ వస్తుందా? లేక పార్టీ ఇంకేమైనా ఆఫర్ చేస్తుందా? అన్నది చూడాల్సిందే.
Also Read: వీటిపై గంటా 45 నిమిషాల పాటు చర్చించిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి