అందుకే.. జేసీ పార్టీ మారుతున్నారా?

అనంతపురం రాజకీయాలంటే గుర్తొచ్చేవి రెండు కుటుంబాలు. ఒకటి పరిటాల, రెండోది జేసీ.. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ కుటుంబాలు ఇప్పుడు ఒకే పార్టీ.. అది కూడా తెలుగుదేశంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి తర్వాత జిల్లాలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు బాగా డీలా పడిపోయారు. ఇక మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అయితే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ సంచలనంగా నిలుస్తుంటారు. గత కొంత కాలంగా జేసీ పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమంటూ కన్‌ఫర్మ్ చేసేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ, జేసీ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నారు.
జేసీ తీరుతో గందరగోళం :
జేసీ దివాకర్‌రెడ్డి ఈ మధ్య వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కొంత గందరగోళం నెలకొంటోందని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ మారుతున్నారని, అలాంటిదేం లేదని.. ఇలా రకరకాల వార్తలతో అయోమయంలో పడిపోతున్నారు. ఈ మధ్యనే జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మన పార్టీ…. అందుకే బీజేపీ అంటే నాకు అభిమానం అని సత్యకుమార్‌తో జేసీ అన్నారు. ఆ తర్వాత రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలుసుకున్నారు. ఆయనను వాటేసుకొని ముచ్చటించారు జేసీ.
వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి :
ఈ రెండు సంఘటనల తర్వాత జేసీ పార్టీ మారుతారన్న ప్రచారానికి మళ్లీ ఊపొచ్చింది. కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న జేసీ.. ఇటీవల అధినేత చంద్రబాబు ముందే విమర్శలు గుప్పించారు. పైగా జిల్లా నాయకత్వం తనకు అండగా ఉండటం లేదన్న ఫీలింగ్‌లో జేసీ ఉన్నట్టు టాక్. మరోపక్క, జేసీని వరుస కేసులు చుట్టుముట్టి ఊపిరాడనీయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జేసీపై ఒత్తిడి తీసుకు వస్తుందని కూడా ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ కారణంగానే ఆయన ఏదో ఒక అధికార పార్టీలో చేరాలనే ఆలోచన చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఉన్న సమయంలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తమ బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా.. అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన్ని సుమారు 8 గంటలపాటు విచారించారు. గతంలో ఎప్పుడూ జేసీకి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. దీంతో అరెస్ట్ చేస్తారేమోననే ఉద్దేశంతో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కొంతకాలంగా ఆయన వ్యాపార సంస్థలపై కూడా ప్రభుత్వ దాడులు జరుగుతున్నాయి. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన సుమారు 30 బస్సులను సీజ్ చేశారు. లారీల వ్యాపారాన్ని కూడా కట్టడి చేశారు.
బీజేపీలో చేరడం ఖాయమేనా? :
జేసీకి సంబంధించిన మైనింగ్ వ్యవహారాలపై కూడా కేసు నడుస్తోంది. మరోపక్క జేసీ అనుచరులపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. వీటన్నిటి ఒత్తిడి మధ్య జేసీ రాజకీయాలు చేస్తున్నా.. ఆశించిన రీతిలో అధికారుల వద్ద తన మాట చెల్లుబాటు కావడం లేదన్న అభిప్రాయం ఆయనలో ఉందంటున్నారు. దాంతో బీజేపీ నేతలను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటున్నారని చెబుతున్నారు.
కేంద్రంలో హోంశాఖ సహాయమంత్రి మాట ఎవరైనా వింటారనే ఉద్దేశంతోనే కిషన్‌రెడ్డితో క్లోజ్‌గా ఉన్నారట. అయితే, జేసీ బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి తనను చుట్టుముట్టిన కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ హెల్ప్ తీసుకుంటే మంచిదన్న ఉద్దేశంతోనే వారి ఎదుట తన బాధనంతా వెళ్లగక్కారని జనాలు అనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో మరి జేసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.