చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి ఎందుకు భేటీ అయ్యారు? మ్యాటరేంటి?

కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ఇండైరెక్టుగా అండగా నిలిచారని పొలిటికల్ సర్కిల్లో చర్చ ఉంది.

చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి ఎందుకు భేటీ అయ్యారు? మ్యాటరేంటి?

Nallari Kiran Kumar Reddy and chandrababu

Updated On : October 7, 2024 / 7:44 PM IST

ఒకరేమో ప్రస్తుత సీఎం.. మరొకరు మాజీ సీఎం..వాళ్లిద్దరూ కలిశారు. చాలా అంశాలపై మాట్లాడుకున్నారు. అందులో ఏముంది? పాలిటిక్స్ అన్నప్పుడు లీడర్లు భేటీ అయి చర్చించుకోవడం కామన్ అనుకుంటున్నారా? అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. నల్లారి ఫ్యామిలీ, చంద్రబాబు మధ్య 50 ఏళ్లకుపైగా వైరం ఉంది. పైగా ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందినవారే.

అయితే, మొన్నటి ఏపీ ఎన్నికల ప్రచారంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజంపేట ఎంపీగా పోటీ చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు మాజీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి మాజీ సీఎం..చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్లినట్లు..వైరం పూర్తిగా ముగిసిపోయినట్లేనా..అన్న చర్చ జరుగుతోంది.

అందుకేనా?
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఏపీ సర్కార్లోని కూటమిలో భాగస్వామిగా ఉంది. అందుకే కిరణ్‌ కుమార్‌ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలో ముఖ్యనేతగా ఎదగాలని భావిస్తున్నారట కిరణ్‌కుమార్‌రెడ్డి. ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాతో భేటీ కాబోతున్న చంద్రబాబుకు తన మనసులో మాటను చెప్పారట.

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కావాలని మాజీ సీఎం నల్లారి కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పురందేశ్వరిని తప్పించే ఆలోచనలో అధిష్టానం లేదని..ఆమె ఆధ్వర్యంలోనే ఏపీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రావడంతో పాటు కూటమి ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు రాలేదని భావిస్తున్నారట.

దాంతో పురందేశ్వరే బీజేపీ ప్రెసిడెంట్గా కొనసాగుతారని అంటున్నారు. దాంతో రాష్ట్రంలోకాకపోతే జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఆశిస్తున్నారట కిరణ్ కుమార్ రెడ్డి. చాలా రాష్ట్రాలకు ఇంచార్జ్ గవర్నర్లు కొనసాగుతున్నారు. ఒకవేళ గవర్నర్ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారట. అదీ కుదరకపోతే త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో తనకు ఓ బెర్త్ కావాలని ఆశపడుతున్నారట. ఇవన్నీ అమిత్ షా చెవిలో వెయ్యిమని నల్లారి చంద్రబాబుతో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది.

మొన్నటి ఎన్నికలతోనే నల్లారి ఫ్యామిలీ, చంద్రబాబు మధ్య వైరం ముగిసినట్లేనన్న చర్చ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి టీడీపీలో చేరారు. అప్పుడే ఆ ఇద్దరి మధ్య వివాదం ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 2014, 2019లో పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కిషోర్ ఓడిపోయారు. అయినా 2024లో మరోసారి ఆయనకే టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఈసారి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పడానికి నల్లారి కుటుంబం, చంద్రబాబు మధ్య సాన్నిహిత్యమే ఎగ్జాంపుల్ అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

అప్పుడు కిరణ్ కుమార్ కుటుంబానికి, చంద్రబాబు మధ్య వైరం
నల్లారి ఫ్యామిలీ, చంద్రబాబు మధ్య 1970 నాటి నుంచి వైరం మొదలైంది. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా హస్తం పార్టీలోనే ఉన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు అభ్యర్థిని పోటీకి దించారు. అక్కడే కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి, చంద్రబాబుకు మధ్య వైరం మొదలైంది.

ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి మరణం తర్వాత పోటీ చేసిన ఆయన సతీమణికి వ్యతిరేకంగా కూడా చంద్రబాబు అభ్యర్థిని దించారు. 1989లో కిరణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ తర్వాత కూడా చంద్రబాబుతో అంటీముట్టనట్లుగానే ఉంటూ వచ్చారు. వైఎస్ హయాంలో స్పీకర్‌గా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను అభినందించడానికి కూడా టీడీపీ నేతలు ముందుకు రాలేదు. 2004-09 మధ్య చంద్రబాబును పలుసార్లు ఇరకాటంలో పెట్టారు కిరణ్ కుమార్‌ రెడ్డి. అయితే జగన్ కాంగ్రెస్‌తో విభేదించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు.

అప్పుడు నల్లారి సీఎం అవడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని అంటున్నారు. అయితే జగన్‌ను వ్యతిరేకించే క్రమంలో.. వైసీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ఇండైరెక్టుగా అండగా నిలిచారని పొలిటికల్ సర్కిల్లో చర్చ ఉంది. ఇప్పుడు ఇద్దరి నేతల భేటీతో వైరం లేదు..అంతా దోస్తానే అన్నట్లుగా మారిపోయింది సీన్. బీజేపీ పెద్దలు కిరణ్కుమార్కి ఏదైనా పదవి ఇచ్చినా దానివెనక చంద్రబాబు సహకారం ఉంటుదన్న చర్చ జరుగుతోంది.

పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్.. కారణం ఏంటంటే..