ఏం చేసిన రివర్స్.. పవన్ మనసులో పెద్ద పెద్ద ప్లాన్లు!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలు కలసిరావడం లేదనే డిస్కషన్ మొదలైంది. ఆయన ఏం చేద్దామనుకుంటే అది రివర్స్ అవుతోందని అంటున్నారు. ప్రశ్నించడానికి మొదలైన పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోతుందనే టాక్ నడుస్తోంది. అయితే పవన్‌కల్యాణ్ మాత్రం పెద్ద ప్లాన్స్‌తోనే ముందుకెళ్లేందుకు సిద్ధపడుతున్నా బెడిసి కొట్టేలా కనిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి దూరమయ్యాక సాగించిన ఒంటరిపోరులో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమరావతిలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచి ఒక్కసారిగా ఆ ఉద్యమం ఊపందుకోవడానికి కారణమయ్యారు. ఇంతలోనే కేంద్రంలోని బీజేపీ నుంచి పిలుపు రావడం.. ఆ తర్వాత ఆ పార్టీతో కలిసి సాగాలని నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఒక్కడే వెళ్లిన పవన్ :
బీజేపీ, జనసేన కలిసి రాజధాని రైతులకు మద్దతుగా పోరాడేందుకు కార్యాచరణతో ముందుకొస్తాయని భావించారు. కానీ, పరిస్థితులు ఇంతలోనే మారిపోవడంతో పవన్ కల్యాణ్ కంగుతిన్నారంటున్నారు. దీంతో ఆయన ఒక్కరే మరోసారి అమరావతికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలెవరూ పాల్గొనలేదు. అదే సమయంలో మరోపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి బీజేపీ దగ్గరవుతున్నట్టు ప్రచారం మొదలైంది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు చిగురించవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. గతంతో పోలిస్తే ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా జగన్‌కు రెడ్‌కార్పెట్ స్వాగతం పలకడమే దీనికి కారణం.
ఏపీలో శాసనమండలి రద్దుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే బీజేపీ-వైసీపీ పొత్తుపై వారిద్దరి కంటే ప్రస్తుతం కాషాయ పార్టీతో భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ కలవరపడడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలాపడిన టీడీపీ, జనసేనలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పటి దాకా చేసిన కార్యక్రమాల వల్ల టీడీపీకి కాస్తోకూస్తో మైలేజ్ దక్కగా.. జనసేనకు మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు.
ఆ ఆలోచనతోనే పవన్ :
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించిన పవన్.. ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావించారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలు వేరుగా ఉండటంతో రాష్ట్రంలో ఆ పార్టీతో కలిసి ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటించలేని పరిస్ధితి పవన్‌కు ఎదురవుతోంది. రాజధాని రాష్ట్ర పరిధిలోని వ్యవహారమంటూ కేంద్ర మంత్రులు తేల్చిచెప్పడంతో టీడీపీతో పాటు పవన్ కూడా షాకయ్యారు.
ప్రస్తుత రాజకీయ వ్యవహారాలను గమనించిన తర్వాత పవన్.. వైసీపీ, బీజేపీ నేతల కంటే ముందుగా తానే క్లారిటీ ఇచ్చేశారని అంటున్నారు. బీజేపీ-వైసీపీ కలిస్తే తాను బీజేపీని వీడతానంటూ హెచ్చరికలు పంపారు. వీటి వెనుక భారీ వ్యూహమే ఉందని చెబుతున్నారు. వైసీపీతో పొత్తు కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేయాలన్న ఆలోచనతోనే పవన్.. ముందుగానే స్పందించారని గుసగుసలు ఆడుతున్నారు.