టీడీపీలో వారసులు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఏం తప్పు చేశారు?

tdp leaders sons: తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్.. యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే యువత పునాదులుగా ఏర్పడ్డ పార్టీయే టీడీపీ. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీలో యువత అంటే పార్టీ సీనియర్ నాయకుల వారసులను మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్ జమానాలో పార్టీలోకి వచ్చిన వారంతా నేడు చంద్రబాబు హయాంలో పార్టీలో సీనియర్స్‌గా కంటిన్యూ అవుతున్నారు.
వారసులను ప్రజలు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు:
ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లలో చాలామంది రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తూ, తాము ప్రాతినిధ్యం వహించే స్థానాన్ని వారసులకు అప్పగించేస్తున్నారు. ఇక సీటు మాకే అంటూ వారసులు కర్చీఫ్ వేసుకొని కూర్చుంటున్నారు. కానీ అలాంటి వారసులను ప్రజలు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. కేవలం సమర్ధతే ఆధారంగా వారసులు సక్సెస్ అవుతారని పలు సందర్భాల్లో రుజువైంది కూడా. టీడీపీలోని చాలామంది రాజకీయ వారసుల ఫెయిల్యూర్ స్టోరీస్ ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని పార్టీలోని కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. అతి కొద్దిమంది వారసులే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు.
ఓటమి తర్వాత దూరంగా ఉంటున్న బొజ్జల సుధీర్:
2019 ఎన్నికల ముందు వారసుల కోటాలో పార్టీ హైకమాండ్‌తో పోరాడి టికెట్లు సాధించినా.. ఎన్నికల గోదాలో మాత్రం చతికిలపడ్డారు. ముఖ్యంగా రాయలసీమ నుంచి చూస్తే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ ప్రస్తుతం శ్రీకాళహస్తి ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలెవరికీ అందుబాటులో లేరు. కేడర్‌ను పట్టించుకోవడం లేదంటున్నారు. ఇలాంటి వారు నాయకులుగా సక్సెస్ కాలేరని చెబుతున్నారు.
తండ్రి పరిటాల రవికి ఉన్న పోరాట పటిమ శ్రీరామ్‌కు లేదని గుసగుస:
చిత్తూరు జిల్లాకే చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భాను సైతం అంత క్రియాశీలకంగా లేరనే అంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా భాను రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారన్నది కార్యకర్తల మాట. అనంతపురం జిల్లాలో దివంగత పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ రాజకీయంగా ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉండగా కేడర్‌ను పూర్తిగా విస్మరించారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. తండ్రి పరిటాల రవికి ఉన్న పోరాట పటిమ శ్రీరామ్‌కు లేదని గుసగుసలాడుకుంటున్నారు.
రాణించలేకపోతున్న జేసీ బ్రదర్స్ వారసులు, భూమా అఖిలప్రియ, కేఈ తనయుడు:
జేసీ బ్రదర్స్ వారసులు సైతం రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. జేసీ పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్‌రెడ్డి అంత సీరియస్ పొలిటిషన్లు కాదన్నది కార్యకర్తల అభిప్రాయం. ఇక, కర్నూలు జిల్లాలో భూమా అఖిల ప్రియ మంత్రిగా పని చేసినా కేడర్‌పై పట్టును సాధించలేకపోయారని అంటున్నారు. ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాం సైతం రాజకీయాల్లో రాణించలేక పోతున్నారు.
గట్టి పోరాటం చేసి టికెట్ సాధించుకున్న టీజీ భరత్ సైతం యాక్టివ్ గా లేరు:
గట్టి పోరాటం చేసి కర్నూలు సీటు సాధించుకున్న టీజీ భరత్ సైతం ప్రస్తుతం యాక్టివ్‌గా లేరు. తండ్రి టీజీ వెంకటేశ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వీరంతా కేవలం వారసత్వ పునాదితో ఎదగాలని భావించారే తప్ప తమకంటూ గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నాలు చేయడం లేదంటున్నారు. వారి పెద్దలు ఎంత కష్టపడి రాజకీయాల్లో పైస్థాయికి చేరుకున్నారన్నది గుర్తించడం లేదని చెబుతున్నారు. వారసులుగా నియోజకవర్గంపై కర్ర పెత్తనం చేస్తామంటే అటు పార్టీ కార్యకర్తలు గానీ, ఇటు ప్రజలు గానీ అంగీకరించే పరిస్థితులు లేవన్న విషయాన్ని గ్రహిస్తేనే రాజకీయాల్లో రాణించగలరని అంటున్నారు.
కేడర్ తో మమేకం కాలేకపోతున్నారు:
ఇక ఉత్తరాంధ్రలో… గౌతు శిరీష శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించినా తన సొంత నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోయారు. అశోక గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా కేడర్‌తో మమేకం కాలేకపోతున్నారట. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున సైతం అనుకున్న స్థాయిలో పని చేయలేకపోతున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల వల్ల తెరవెనుక ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.
కోడెల శివరామ్ ను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు:
మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు సైతం వివాదాల్లో ఇరుక్కున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్‌ను కార్యకర్తలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఆయన వ్యవహారాలే రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారాయని టాక్. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు, కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని చందు, ఇంకా ఇతర నేతల వారసులు సైతం రాజకీయాల్లో రాణించలేక పోతున్నారు.
అధికారంలో ఉండగా ఓవరాక్షన్ చేశారు:
చాలామంది వారసులపై పార్టీ అధికారంలో ఉండగా చేసిన ఓవర్ యాక్షన్ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని కార్యకర్తలు అంటున్నారు. టీడీపీలోని యువ నేతలు అందరూ ప్రస్తుతం గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ప్రతి అంశాన్నీ కమర్షియల్‌గా ఆలోచించడంతో వీరంతా రాజకీయాల్లో రాణించలేక పోతున్నారని కొందరు సీనియర్ నేతల అభిప్రాయం. గతంలో సీనియర్ నేతలంతా కార్యకర్తలతో కలసిపోయి, వారితో మమేకం కావడం వల్లే సక్సెస్ అయ్యారన్నది వారసులు గుర్తించాలని కార్యకర్తలు సలహా ఇస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వారి వైఖరి మార్చుకుంటే కొద్దో గొప్పో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.