విశాఖ టూర్‌తో జగన్‌ మౌనం.. సీఎం మదిలో ఏముంది?

  • Published By: sreehari ,Published On : January 3, 2020 / 09:00 AM IST
విశాఖ టూర్‌తో జగన్‌ మౌనం.. సీఎం మదిలో ఏముంది?

Updated On : January 3, 2020 / 9:00 AM IST

ఎగ్యిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించిన తర్వాత తొలిసారిగా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌కు జనాలు బాగానే స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర ముందుగా ప్లాన్‌ చేసుకున్నట్టుగానే మానవహారంగా ఏర్పడ్డారు. పూలు జల్లి స్వాగతం పలికారు. జగన్ ఇచ్చిన గిఫ్ట్‌తో పులకించిన విశాఖ వాసులు విశాఖ ఉత్సవ్‌లో జగన్నామ స్మరణ చేశారు.

విశాఖ ఉత్సవ్‌కు సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా వస్తున్నారంటూ మంత్రులు, అధికారులు గత పది రోజులుగా హడావుడి చేశారు. అయితే ఆయన గట్టిగా గంటసేపు కూడా వేదికపై లేరు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. జగన్‌ ప్రసగించి నగరానికి మరిన్ని వరాలు ప్రకటిస్తారని, రాజధాని విషయమై కూడా ప్రస్తావిస్తారని అనుకున్న జనానికి నిరాశే మిగిలిందంటున్నారు.

తప్పని ఆశాభంగం :
నగరానికి రావడమే గంట ఆలస్యంగా వచ్చారు సీఎం జగన్‌. అక్కడి నుంచి కాన్వాయ్‌లో 24 కిలోమీటర్లు గంటన్నర ప్రయాణించి కైలాసగిరికి చేరుకున్నారు. శంకుస్థాపనలు చేశాక… వెంటనే సిటీ సెంట్రల్‌ పార్కుకు చేరుకున్నారు. అక్కడ శిలాఫలకాలు ఆవిష్కరించాక… పుష్ప ప్రదర్శన కూడా తిలకించకుండా ఆర్‌కే బీచ్‌లోని విశాఖ ఉత్సవ్‌కు వచ్చారు. అక్కడ కూడా అంతంత మాత్రంగానే గడిపారు. సీఎం జగన్ విశాఖ వాసుల గురించి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గురించి మాట్లాడతారని ఆశించిన నేతలకు షాకిస్తూ.. కనీసం నోరు విప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

విశాఖ వేదికగా జగన్‌ ప్రసంగిస్తారని అందరూ భావించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంశాన్ని ఖరారు చేయడం గానీ.. కనీసం మరింత క్లారిటీ అయినా ఇస్తారని అంతా ఆశపడ్డారు. నగరానికి వరాల జల్లు కురిపిస్తారని ఎదురు చూశారు. కానీ జనం ఒకటి తలిస్తే, జగన్‌ మరోకటి చేశారు.

విశాఖ ఉత్సవ్ సభ వద్ద మాట్లడలేదు. సీఎంకు టి.సుబ్బరామిరెడ్డి, జిల్లా ప్రజల తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్ వేర్వేరుగా సన్మానాలు చేసేశారు. ఆ తర్వాత నేవీ చీఫ్ అతుల్ జైన్ దంపతులను జగన్ సన్మానించారు. ఇక సీఎం మాడ్లాడటమే తరువాయి అని ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుండగానే సీఎం వేదిక నుంచి కిందక దిగిపోవడం చూసి జనం షాకయ్యారు. ఏదో అనుకుంటే ఇలా చేశారేంటి అనుకున్నారట.

మౌనం వెనుక కారణమేంటి? :
ముఖ్యమంత్రి జగన్‌ మౌనం వెనుక కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా జగన్ మౌనం వెనుక కారణంగా చూపిస్తున్నారు. చంద్రబాబు న్యాయవ్యవస్థ ద్వారా విశాఖను రాజధాని కాకుండా కుట్రలు పన్నుతూ అడ్డుకుంటున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు.

ఏం జరిగినా అన్నీ చంద్రబాబే కారణంగా చూపించడం వైసీపీకి అలవాటుగా మారిపోయిందంటున్నారు జనాలు. అసలు కేంద్రం మోకాలడ్డుతోందా? చంద్రబాబు అడ్డుకుంటున్నారా? అసలు సీఎం జగన్ మౌనం వెనుక అర్థమేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ చంద్రబాబు అడ్డుకున్నారనే అనుకుంటే ముందుగానే అన్నింటినీ క్లియర్‌ చేసుకొని ప్రకటించవచ్చు కదా.. ఇలా హడావుడిగా ప్రకటనలు చేసి తమ భావోద్వేగాలతో ఎందుకు ఆటలాడుతున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు.

మాటైన మాట్లాడలేదని :
వేదికపై సీఎం జగన్‌ 25 నిమిషాలుండగా… నిర్వాహకులు 20 నిమిషాలు విద్యుద్దీపాలు ఆపేసి చీకట్లో లఘుచిత్రం, లేజర్‌ షో చూపించేశారు. ఆ తర్వాత ఐదు నిమిషాల్లో సన్మానాల హడావుడితో జగన్‌ పర్యటన పూర్తి కానిచ్చేశారు. జనానికి నమస్కారం పెట్టేసి వెళ్లిపోయారు. రాజధాని గురించి మాట్లాడకపోయినా… కనీసం విశాఖ ఉత్సవ్‌ గురించి అయినా మాట్లాడాల్సింది కదా అని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. జగన్‌ మౌనంతో ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరికినట్టయ్యిందని అంటున్నారు. ఈ విషయమై వైసీపీ ముఖ్య నాయకులు ఏమీ చెప్పలేక తలలు పట్టుకుంటున్నారట.

ప్రతిపక్షాల దాడి మరింత పెరగడంతో ఒక్కొక్కరికి వచ్చి జగన్ ఎందుకు మాట్లాడలేదో చెప్పుకుంటున్నారట వైసీపీ నేతలు. మరికొందరు నేతలు మాత్రం జగన్‌ మాట్లడతారని మీకు చెప్పారా? అసలు ఎందుకు మాట్లాడాలి అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట.

విశాఖే రాజధాని అని వైసీపీ నేతలు చెబుతున్నారే తప్ప సీఎం మాత్రం సుముఖంగా లేనట్లు వెళ్లిపోవడంతో రాజధాని మేటర్ ఇక క్లోజ్‌ అయిపోయినట్టేనని జనాలు గుసగుసలు ఆడుకుంటున్నారు. అంతే కాక అప్పటి వరకు హడావుడా చేసిన విజయసాయి రెడ్డి కూడా ఆ తర్వాత పత్తా లేకపోవడంతో అసలు కథ ముగిసిందని అనుకుంటున్నారు.