ఎన్డీయేలో కీలకంగా మారిన చంద్రబాబు..! ఈసారైనా ఏపీ దశ మారబోతోందా?
నవ్యాంధ్ర.. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిందా? కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోవడం ఏపీకి ఎంతో ఉపయోగం అంటున్నారు..

Chandrababu Naidu : కింగ్ ఎవరో, కీలకమైన పార్టీ ఏదో తేలిపోయింది. ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఇక్కడే ఆసక్తికర చర్చ మొదలైంది. బీజేపీ ఎన్డీయే కూటమికి పూర్తి మెజారిటీ రాకపోవడం ఏపీకి కలిసి వస్తుందా? ఏపీ దశ మారబోతోందా? నవ్యాంధ్ర.. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిందా? కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోవడం ఏపీకి ఎంతో ఉపయోగం అంటున్నారు పరిశీలకులు. 16 ఎంపీ సీట్లతో చంద్రబాబు ఎన్డీయేని శాసించి ఏపీకి కావాల్సిన నిధులు రాబట్టగలుగుతారా?
కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరనుంది. ఎన్డీయే మిత్రపక్షాలతో కలిపి మ్యాజిక్ ఫిగర్ సీట్లను సాధించగలిగింది బీజేపీ. సెంట్రల్ లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం ఏపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీయేకు 292 సీట్లు రాగా(బీజేపీకి సొంతంగా వచ్చిన సీట్లు 240), ఇండియా కూటమికి 234 స్థానాలు దక్కాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో 16 ఎంపీ సీట్లు దక్కించుకున్న టీడీపీ.. ఎన్డీయేలో కీ రోల్ ప్లే చేయనుంది. చంద్రబాబు కింగ్ మేకర్ గా మారుతున్నారు. బీజేపీకి వన్ సైడ్ మెజారిటీ రాకపోవడం ఏపీకి ఉపయోగకరంగా మారే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఏపీ ఎదిగిందని భావించొచ్చు అని చెబుతున్నారు.
2014లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు వచ్చాయి. 2019లో 303 సీట్లు సాధించింది. ఆ రెండు టర్మ్ లలో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రావడంతో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించలేకపోయాయి ఏపీ ప్రభుత్వాలు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో కొనసాగిన చంద్రబాబు అయినా.. 2019 నుంచి ఇప్పటివరకు పవర్ లో ఉన్న జగన్ అయినా.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ తో సఖ్యతతో మెలుగుతూ, బతిమాలుతూ, రిక్వెస్టింగ్ మోడ్ లో నిధులు, ప్రాజెక్టులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయినా గత పదేళ్లలో అనుకున్న స్థాయిలో కేంద్రం ఏపీకి న్యాయం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల ఫలితాలతో సీన్ మారింది.
ఈసారి బీజేపీకి సొంతంగా 240 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్డీయే పక్షాలతో కలిపి 292 స్థానాలను సొంతం చేసుకుంది బీజేపీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. దీంతో ఎన్డీయే పక్షాల డిమాండ్లకు తలొగ్గుతూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది
బీజేపీకి. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీయేలో కింగ్ మేకర్ అవుతున్నారు. టీడీపీకి వచ్చిన 16 లోక్ సభ సీట్లు కీలకంగా మారబోతున్నాయి. దాంతో కేంద్రంలో కీలకమైన మంత్రి పదవులు తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్తగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వంలో కింగ్ మేకర్ కానున్న చంద్రబాబు.. ఏపీకి న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇప్పుడున్న పరిస్థితులను సరిగ్గా వాడుకుంటే.. విభజన హామీలను మొత్తం రాబట్టుకునే అవకాశం
ఉందంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు సాధించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటున్నారు ఎనలిస్టులు. అందుకే, చంద్రబాబు కేంద్రంలో ఐదారు మంత్రిత్వ శాఖలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం జల్ శక్తి శాఖ, అలాగే ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, కేంద్ర ఆర్థిక శాఖలు అడిగే అవకాశం ఉన్నట్లు టాక్.
ఫలితాలు ఎలా ఉన్నా.. ఎవరు ఓడి, ఎవరు గెలిచినా.. ఈసారి కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోవడం అయితే.. ఏపీకి కలిసి వచ్చే అంశమే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. బీజేపీకి ఈసారి కూడా ఫుల్ మెజారిటీ వస్తే.. అధికారంలో ఉన్న పార్టీ దయతలిచి ఇస్తే తీసుకోవడం తప్ప.. శాసించే పరిస్థితి ఉండదంటున్నారు. ఎన్డీయే పక్షాల సీట్లతో కలిపి బీజేపీకి నెక్ టు నెట్ మెజారిటీ రావడం ఏపీకి అనుకూల అంశం అంటున్నారు. బతిమాలే స్టేజ్ నుంచి బార్గేనింగ్ స్టేజ్ కు పరిస్థితి వచ్చేసిందని, ఇప్పుడే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఏపీని కావాల్సినంత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Also Read : జగన్ ఘోర ఓటమికి, చంద్రబాబు ఘన విజయానికి ప్రధాన కారణాలివే- మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు