ఎమ్మెల్యేతో ఢీ : రాయచోటిలో భగ్గమన్న విభేదాలు 

  • Published By: sreehari ,Published On : January 16, 2020 / 02:35 PM IST
ఎమ్మెల్యేతో ఢీ : రాయచోటిలో భగ్గమన్న విభేదాలు 

Updated On : January 16, 2020 / 2:35 PM IST

కడప జిల్లా రాయచోటిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కాగా, మరొకరు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే యువనేత. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి పొసగడం లేదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే తాను చెప్పిందే చేయాలని, ఇతర నేతల సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని అధికార యంత్రాంగానికి పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారట. పార్టీ గెలుపు కోసం తన వర్గం కష్టపడి పని చేసిందని, తనను కట్టడి చేయడం ఎవరి వల్ల కాదంటూ ఎమ్మెల్యేతో ఢీ అంటున్నారు మండిపల్లి. 

రంగంలోకి మండపల్లి : 
ఇటీవల రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెరపైకి తీసుకొచ్చిన జూనియర్ కళాశాల స్థల వివాదం, వీరి మధ్య మరింత విభేదాలు పెంచేందుకు ఆజ్యం పోసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించి కళాశాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు ఇప్పించాలని, ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని మండిపల్లి అంటున్నారు. ఎమ్మెల్యే నిర్ణయంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందట.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ధర్నాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా సంఘాలకు నేత లేక ఉద్యమం చల్లారిపోతుందనే ప్రచారం సాగుతున్న తరుణంలో వైసీపీకి చెందిన మండపల్లి రంగంలోకి దిగారు. ర్యాలీలు, వంటావార్పు కార్యక్రమాలతో ఉద్యమాన్ని హోరెత్తించారు.

ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపై వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత రాంప్రసాద్ రెడ్డికి అనుకూలంగా మారిందంటున్నారు కార్యకర్తలు. 90 ఏళ్లుగా విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థలను అనాలోచిత నిర్ణయంతో ఒక వర్గానికి కట్టబెట్టడం నచ్చలేదంటున్నారు.

ఇప్పటికే రాంప్రసాద్ రెడ్డి సొంత మండలమైన చిన్నమండెంలో మరో వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారట. దీంతో వీరి విభేదాలు మరింత ముదిరాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన రాంప్రసాద్ రెడ్డిపై సీఎం జగన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది.