Y.S.Viveka Murder: వివేకా హత్యకేసు.. హైడ్రామా మధ్య ఆయుధాల స్వాధీనం!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు సంతరించుకుంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. రహస్యంగా ఆయుధాల కోసం వేట కొనసాగించిన సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రానికి ఈ పనిపూర్తిచేశారు.

Pulivendula
Y.S.Viveka Murder: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక మలుపు సంతరించుకుంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. రహస్యంగా ఆయుధాల కోసం వేట కొనసాగించిన సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రానికి ఈ పనిపూర్తిచేశారు. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రొద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది.
సోదాల సందర్భంగా ఇంట్లో అవసరాలకు వాడే కొన్నిరకాల వస్తువులు, వ్యవసాయ పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా రోటరీపురం, గారండాల వాగు దగ్గర 26 మంది మున్సిపల్ సిబ్బందితో మూడు రోజుల పాటు ఆయుధాల కోసం తవ్వకాలు జరపగా జాడ దొరకలేదని అన్వేషణ ఆపేసినట్లుగా ప్రకటించారు. కానీ.. అనూహ్యంగా అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం హైడ్రామాగా మారింది. దీంతో పాటు కర్ణాటక నుంచి 20 మంది బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కడపకు వచ్చి సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివేకా హత్యకేసుకు ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోండగా ఈ కోణంలోనే ఇప్పటికే బలమైన ఆధారాలు లభించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అరెస్టైన సునీల్ యాదవ్ ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేసిన సీబీఐ అధికారులు.. వ్యవసాయానికి వాడే కత్తులు, కొడవళ్ళను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ యాదవ్ బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా కూడా వెంట తీసుకెళ్లగా పంచనామా నిర్వహించి, సునీల్ తండ్రికి వస్తువుల జాబితా అందజేశారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇళ్లలో కూడా తనిఖీలు చేయగా అక్కడ నుండి కూడా కొన్ని పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.