వ్యూహాలపై సమీక్షలు : టీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేశారు. 2019, నవంబర్ 15వ తేదీ సాయంత్రం ఈ సమావేశాలు జరుగనున్నాయి. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో చర్చించనున్నారు నేతలు.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ మీటింగ్ జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌పీపీ సమావేశాలకు అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ అధ్యక్షత వహించారు. శుక్రవారం జరిగే సమావేశంలో తొలిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ముందుగా కేసీఆరే పాల్గొంటారని అనుకున్నా.. తర్వాత కేటీఆర్ అధ్యక్షత వహిస్తారని తేలింది. సమావేశాల్లో పార్టీ తరఫున లోక్‌సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాల కోసం ఈసారి కేంద్రాన్ని గట్టిగా కోరే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా శుక్రవారం జరుగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్రం కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. వాస్తవానికి ఈ సమావేశం గురువారం జరగాల్సి ఉన్నా..నాడు – నేడు కార్యక్రమంతో శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలతోపాటు.. కేంద్రం నుంచి రావాల్సి నిధులపైనా చర్చించనున్నారు.
Read More : ఆర్టీసీ సమ్మె 42వ రోజు : సమ్మెపై సర్కార్ దృష్టి