కాకాణి అరెస్ట్‌పై వైసీపీ నేతలు ఫైర్.. తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరిక
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Kakani Govardhan Reddy
Kakani Govardhan Arrest: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకాణిని అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాకాణి అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని, కుట్రలతో నిరాధారమైన కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షం పై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకాణికి జిల్లా పార్టీ అండగా ఉంటుందని, ఆయన్ను అదుపులోకి తీసుకోవడం పై జిల్లా పోలీసులు ప్రకటన చేయాలని నెల్లూరు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి అనిల్ కామెంట్స్ ..
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడూ చూడని అరెస్టులకు ఈ ప్రభుత్వంలో చూస్తున్నామని మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోలేని అభివృద్ధి, సంక్షేమాన్ని కప్పిపుచ్చుకు నేందుకే ఈ అరెస్టులు. అందులో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్. అక్రమ కేసు పెట్టారు కాబట్టే కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్రమ అరెస్టుపై న్యాయపరంగా పోరాటం చేస్తాం. గోవర్ధన్ రెడ్డికి అండగా నిలుస్తామని అనిల్ చెప్పారు. కాకాణి అరెస్టును పోలీసులు అధికారికంగా బులిటెన్ రిలీజ్ చేయాలి. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి కేసుల వల్ల వైసీపీ నాయకులు, శ్రేణుల మనోధైర్యాన్ని తగ్గించలేరని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.
బెంగళూరు సమీపంలో కాకాణిని పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం)కి తరలించారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డిని హాజరుపరిచే అవకాశం ఉంది.