Kakani Govardhan Reddy: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

దాదాపు 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలించారు.

Kakani Govardhan Reddy: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Kakani Govardhan Reddy

Updated On : May 25, 2025 / 9:09 PM IST

Kakani Govardhan Reddy: ఎట్టకేలకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకాణిని అరెస్ట్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2 నెలలుగా కాకాణి పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులలో కాకాణికి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. పోలీసులు కాకాణిని బెంగళూరు నుంచి ఏపీకి తీసుకొస్తున్నారు.

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరారు. కానీ, కాకాణి విచారణకు రాలేదు. అంతేకాదు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేసుల నుంచి రక్షణ పొందేందుకు ఆయన కోర్టులను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం విఫలయత్నాలు చేశారు. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

కాకాణి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఆయన దారులన్నీ మూసుకుపోయాయి. దాదాపు 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో ఆయన బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: మాజీమంత్రి కొడాలి నాని ఎక్కడ..? అమెరికా వెళ్లక ముందే అరెస్ట్ చేస్తారా..?

క్వార్ట్జ్‌ అక్రమాల కేసులో కాకాణి అరెస్ట్ అయ్యారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణ, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది.

నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్‌ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని, ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.