ఓటింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అదృశ్యం..
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఇవాళ మరోసారి ఓటింగ్ జరగనుండగా వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యం కావటం..

YCP MLC Cipai Subramanyam
MLC Doctor Cipai Subramanyam: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ మరోసారి డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఓటింగ్ జరగనుండగా ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారు. గత అర్థరాత్రి నుంచి అతను కనిపించకుండా పోయారని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని అతని అనుచరులు చెబుతున్నారు. ఇవాళ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంది. అయితే, తమ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: AP Municipality Elections : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. అక్కడ చక్రం తిప్పిన బాలయ్య..
తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో సోమవారం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న జరగాల్సిన ఎన్నిక మంగళవారంకు వాయిదా పడింది. ప్రిసైడింగ్ అధికారి, తిరుపతి జేసీ శుభం భన్సల్ సోమవారం ఉదయం 11గంటలకు ఎస్వీయూ సెనేట్ హాల్ లో ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. దాదాపు గంటపాటు ఆయన వేచి చూసినా కోరానికి సరిపడా సభ్యులు రాలేదు. దీంతో ఇవాళ్టికి డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు.
తిరుపతి నగరపాలకంలో 50మంది కార్పొరేటర్లకు గాను 47మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. అయితే, మొత్తం 50 మంది సభ్యులకు గాను సోమవారం ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరయ్యారు. అయితే, ఇవాళ మరోసారి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అదృశ్యం కావటం తీవ్ర కలకలం రేపుతుంది. తమ ఎమ్మెల్సీని కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఇవాళ ఏపీలో ఐదు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి నగరపాలకంలో డిప్యూటీ మేయర్, నందిగామ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ స్థానాలకు, తుని, పిడుగురాళ్లలో వైస్ చైర్ పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.