YCP Operation Akarsh : టీడీపీ అసమ్మతి నేతలపై వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్..!

వైసీపీ పెద్దలతో టచ్‌లో ఉన్న టీడీపీ నేతలు ఎందరు? ఎవరెవరు పసుపుదండు నుంచి పక్కకు తప్పుకుంటున్నారు? ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెట్టింది వైసీపీ అధిష్టానం..

YCP Operation Akarsh : టీడీపీ అసమ్మతి నేతలపై వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్..!

YCP Operation Akarsh On TDP Leaders

Updated On : February 29, 2024 / 11:46 PM IST

YCP Operation Akarsh : వైసీపీ రివర్స్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌ చేసిందా? టీడీపీలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ గూటికి చేరుకుంటున్నారా? విజయవాడ ఎంపీ కేశినేని నాని నుంచి మొదలైన వలసలు… ఇక ముందు మరింత జోరందుకుంటాయా? వైసీపీ పెద్దలతో టచ్‌లో ఉన్న టీడీపీ నేతలు ఎందరు? ఎవరెవరు పసుపుదండు నుంచి పక్కకు తప్పుకుంటున్నారు? ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెట్టింది వైసీపీ అధిష్టానం.. తమ పార్టీ లీడర్లకు టీడీపీ గాలం వేస్తుంటే… ఆ పార్టీలో అసమ్మతులను ఆకర్షించే పని వేగవంతం చేసింది వైసీపీ.. ఈ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విజయవాడ ఎంపీ కేశినేని నానికి బాధ్యతలు అప్పగించింది.

Read Also : Pawan Kalyan : కాపులు ఎటువైపు? 24 సీట్లు తీసుకున్న పవన్ కల్యాణ్‌పై విమర్శలు ఎందుకు?

సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన ఎంపీ నాని… గత నెలలో వైసీపీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారితో టచ్‌లో ఉన్న ఎంపీ నాని… పార్టీ ఆదేశాల ప్రకారం టీడీపీ అసంతృప్తులను ఆకర్షిస్తున్నారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడం వెనుక నాని పాత్ర ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాతోపాటు రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

వైసీపీ వైపు చూస్తున్న అసంతృప్త నేతలు :
టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాలో టికెట్లు దక్కని నేతలు… ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేసమయంలో సీఎం జగన్‌ సొంత నియోజకవర్గానికి చెందిన సతీశ్‌రెడ్డి కూడా ఫ్యాన్‌ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితోపాటు, సీఎం జగన్‌పైనా గతంలో పోటీచేశారు సతీశ్‌రెడ్డి. పులివెందులలో టీడీపీ అంటే సతీశ్‌రెడ్డే గుర్తుకువచ్చేవారు. అలాంటి నేతను ఆకర్షించి టీడీపీని దెబ్బతీయాలని భావిస్తున్నారు సీఎం జగన్‌. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, జలీల్‌ఖాన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అవనిగడ్డ టికెట్‌ దక్కని బుద్ధప్రసాద్‌ టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. అవనిగడ్డలో వైసీపీకి కూడా సరైన అభ్యర్థి లేకపోవడంతో బుద్ధప్రసాద్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ప్రముఖ కాపు నేతగా రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణకు ఎక్కడా టికెట్‌ కేటాయించలేదు టీడీపీ. ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్న పరిస్థితీ లేకపోవడంతో వైసీపీ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. రాధాకృష్ణ వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అదేవిధంగా విజయవాడ వెస్ట్‌ టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి జలీల్‌ఖాన్‌ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డితో కొద్దిరోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ తర్వాత లోకేశ్‌తోనూ కలిసారు. ఇలా రెండు పడవలపై పయనిస్తున్న జలీల్‌ఖాన్‌ తీరు అనుమానాస్పదంగా ఉందంటున్నారు పరిశీలకులు.

బుద్ధప్రసాద్‌తో మంతనాలు..  :
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ టికెట్లు దాదాపు ప్రకటించింది. ఐతే అవనిగడ్డ సమన్వయకర్తగా నియమించిన సింహాద్రి చంద్రశేఖరరావు పోటీకి విముఖంగా ఉన్నారనే టాక్‌తో బుద్ధప్రసాద్‌తో మంతనాలు జరుపుతోంది వైసీపీ. ఇక ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టికెట్‌ నిరాకరించింది టీడీపీ… దీంతో గన్నవరం టికెట్‌ ఇస్తామని వైసీపీ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ను కూడా కలిశారు ముద్దరబోయిన… ఐతే తాజాగా గన్నవరంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంశీనే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండటంతో ముద్దరబోయిన వెనక్కు తగ్గారంటున్నారు. ఇక అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతోనూ వైసీపీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలాకు నిరాశే ఎదురైంది. ఐతే జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో పీలాకు బంధుత్వం ఉందంటున్నారు. దీనివల్ల ఆయన వైసీపీలోకి వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్లు టాక్‌ వినిపిస్తోంది.

గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు… అప్పట్లో తన సిట్టింగ్‌ స్థానమైన ఉండిని త్యాగం చేశారు. ఈ ఎన్నికల్లో ఉండి నుంచి పోటీచేయాలని శివరామరాజు భావిస్తే, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజుకే చాన్స్‌ ఇచ్చింది వైసీపీ. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు శివరామరాజు. కీలకమైన నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో శివరామరాజును ఆకర్షిస్తే బాగుంటుందనే ఆలోచనతో వైసీపీ సంప్రదించినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్లాన్‌ను గమనించిన సిట్టింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెంటనే రంగంలోకి దిగి శివరామరాజుతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా తెలుగుదేశం-జనసేన కూటమిలో అసంతృప్తిగా ఉన్నవారితో టచ్‌లోకి వెళుతున్న వైసీపీ…. వారిని పార్టీలో చేర్చుకోడానికి చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదేసమయంలో టీడీపీ అధిష్టానం కూడా అసంతృప్తులతో చర్చలు జరుపుతోంది. అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు దక్కుతుందని భరోసా ఇస్తోంది. ఐతే చాలామంది నేతలు వైసీపీలో చేరేందుకే మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు. పులివెందులకు చెందిన సతీశ్‌రెడ్డి దాదాపు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా, తగిన హామీ ఇస్తే చేరేందుకు ముద్ధరబోయిన సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక బుద్ధప్రసాద్‌, వంగవీటి రాధాకృష్ణ, శివరామరాజు, జలీల్‌ఖాన్‌ ఊగిసలాటలో ఉన్నారంటున్నారు. మొత్తానికి ఒకటి రెండు రోజుల్లో ఈ నేతల వలసపై క్లారిటీ వస్తుందంటున్నారు పరిశీలకులు.

Read Also : Pawan Kalyan : కాపులు ఎటువైపు? 24 సీట్లు తీసుకున్న పవన్ కల్యాణ్‌పై విమర్శలు ఎందుకు?