Bapatla: పెళ్లికోసం ఓ యువకుడు అత్యుత్సాహం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కరపత్రాలు.. రంగంలోకి పోలీసులు
నిలకడలేని మనస్సును కలిగిన మనుషులు తమ గమ్యాన్ని చేరుకోలేరు. ఆశపడండి, దురాశ పడవద్దు… అంటూ కరపత్రంలో యువకుడు కోటేషన్స్ రాశాడు.

Wanted Bride
Andhra Pradesh: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో కరపత్రాలు కలకలం రేపాయి. పెళ్లి సంబంధాలకోసం ఓ యువకుడు వినూత్న పద్దతిని అవలంభించాడు. నేనంటే ఇష్టం ఉన్న మహిళలు తనతో నేరుగా కలిసి మాట్లాడాలంటూ.. అదికూడా తెల్లవారుజామున 3గంటల నుండి 6 గంటలలోపు తన నివాసానికి నేరుగా మధ్య వర్తులు లేకుండా వచ్చి గంట కొట్టాలంటూ కరపత్రాల్లో యువకుడు పేర్కొన్నాడు. రామన్నపేట గ్రామంలోని విద్యుత్ స్థంబాలు, గోడలపై ఇందుకు సంబంధించిన కరపత్రాలను యువకుడు అతికించాడు.
యువకుడి అత్యుత్సాహం వల్ల సోషల్ మీడియాలో కరపత్రాలు వైరల్ గా మారాయి. మేనక అందం, ఊర్వశి నాట్యం లేకపోయినా ఫర్వాలేదు.. నన్ను నన్నుగా ఇష్టపడితే చాలు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మా ఇంటికి రండంటూ తన నివాసంతో పాటు గ్రామంలోని విద్యుత్ స్థంభాలు, గొడలపై పోస్టర్లను అతికించాడు. రామన్నపేటకు చెందిన 28 ఏళ్ళ అయ్యప్పకుమార్ వింత చేష్టలతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అయితే, కరపత్రాలు అంటించిన యువకుడు అయప్ప కుమార్ పరారీలో ఉన్నాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇష్టం ఉన్న అమ్మాయిలు, ఎటువంటి ఫోన్లు, యస్ఎంఎస్‌లు చేయాల్సిన అవసరం లేకుండా రామన్నపేటలోని నా ఇంటి అడ్రస్‌కు నేరుగా వచ్చి నన్ను ధైర్యంగా కలవగలరు అంటూ కరపత్రాల్లో యువకుడు ముద్రించాడు. నా అడ్రస్‌కు వచ్చే సమయంలో మీ ఫోటోలు తీసుకొని మీకు వీలున్న రోజుల్లోనే రాగలరంటూ యువకుడు ఆ కరపత్రాల్లో పేర్కొన్నాడు. మీరు వచ్చే సమయానికి నేను ఇంట్లో లేనట్లయితే మరల నన్ను ఎప్పుడైనా కలవవచ్చంటూ కరపత్రంలో అయప్ప కుమార్ సూచించాడు.
నిలకడలేని మనస్సును కలిగిన మనుషులు తమ గమ్యాన్ని చేరుకోలేరు. ఆశపడండి, దురాశ పడవద్దు… అంటూ కోటేషన్స్ రాశాడు. తన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరినీ కలవవద్దని, ఇంటి ముందు వేలాడదీసిన ఓ సత్తుగిన్నెను గంటను మోగించాలని కొండగుర్తుగా యువకుడు సూచించాడు. కరపత్రాల్లో ఇతని చేష్టలు చూసిన జనం ఇదెక్కడి చోద్యమంటూ చర్చించుకుంటున్నారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అయ్యప్ప కుమార్ అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. కరోనా ముందుదాకా హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తూ అనంతరం ఖాళీగా ఉంటూ తనకు పెళ్ళి చేయాలని అమ్మమ్మపై యువకుడు ఒత్తిడి తెస్తున్నాడు. పనీపాట లేనివాడికి పిల్లను ఎవరిస్తారని అమ్మమ్మ మందలించడంతో తనకు తానే పెళ్ళి చేసుకునేందుకు ఈ వింత పద్దతిని యువకుడు ఎంచుకున్నట్లు తెలిసింది. అయ్యప్ప కుమార్ వ్యవహారం వేటపాలెంలో చర్చనీయాంశంగా మారడంతో ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.