కాలేజీలపై పర్యవేక్షణ లోపం.. హిడెన్‌ కెమెరాలు.. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది: జగన్

గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని..

కాలేజీలపై పర్యవేక్షణ లోపం..  హిడెన్‌ కెమెరాలు.. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది: జగన్

YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీతో పాటు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.

ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ అన్నారు. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారని చెప్పారు. మరోవైపు, గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అన్నారు. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇదని చెప్పారు. చంద్రబాబు ఇకనైనా మేలుకోవాలని. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదని, వారి భవిష్యత్తును పణంగా పెట్టవద్దని అన్నారు.

పులివెందుల పర్యటనకు జగన్‌
జగన్‌మోహన్‌ రెడ్డి రేపు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గంలో మాచునూరు వెళతారు. ఆ తర్వాత అక్కడి నుంచి గొందిపల్లె చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందుల బయలుదేరి వెళతారు. మూడు రోజుల పాటు పులివెందులలో వైఎస్‌ జగన్‌ అందుబాటులో ఉంటారు.

Also Read: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి