YS Jagan : చంద్రబాబు నడిపే హెరిటేజ్‌లో ఉల్లి కేజీ రూ.35.. రైతులకు మాత్రం 8 రూపాయలే.. వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం తాళ్లపల్లె గ్రామంలో ఉల్లి, చీనీ పంటలను పరిశీలించారు.

YS Jagan
YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం వేంపల్లె మండలం తాళ్లపల్లె గ్రామంలో ఉల్లి, చీనీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో క్వింటా ఉల్లి ధర రూ. 4వేల నుంచి రూ.12వేలు పలికింది. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా రూ.800 పలుకుతోంది. ఉల్లి రైతులకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరం. ఉల్లి రైతులకు కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో చీనీ ధరలు టన్ను 30 వేల నుంచి లక్ష వరకు ధర పలికింది. ప్రస్తుతం చీనీ ధరలు 6000 నుంచి 12 వేలకు కూడా కొనేపరిస్థితి లేదు. వైసీపీ హయాంలో అరటి టన్ను రూ.30,000 పలికింది. ప్రస్తుతం 3వేల ధర పలుకుతోంది. 3వేలకు కూడా అరటిపంట కోసేవారు లేరు. వైసీపీ హయాంలో ఎక్కడా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ లేదు. నేరుగా ఆర్బీకేల ద్వారానే రైతులకు ఎరువులు విత్తనాలను సరఫరా చేసేవాళ్లమని జగన్ అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాడని జగన్ ఆరోపించారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సొసైటీలు, ఆర్బికేలు ప్రస్తుత ప్రభుత్వంలో లేవు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమీషన్లు రావని ఆర్బికే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. బ్లాక్ మార్కెట్, దళారీ వ్యవస్థను దగ్గరుండి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాత సుఖీభవ 40,000 ఇవ్వాల్సి ఉంటే ఐదువేలతో సరిపెట్టాడు. ఉచిత పంటల బీమా ప్రస్తుత ప్రభుత్వంలో లేదు. రైతులకు కనీస ధర 2500 ఇచ్చి ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నడిపే హెరిటేజ్‌లో మాత్రం ఉల్లి కేజీ రూ. 35 దాకా అమ్ముతున్నారు. రైతులకు మాత్రం ఎనిమిది రూపాయలతో సరిపెడుతున్నారంటూ జగన్ అన్నారు.