రాజంపేటలో వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు..

ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజంపేటలో వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు..

Updated On : September 1, 2025 / 6:59 PM IST

Cm Chandrababu: దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. అలాంటి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా? ప్రజలు ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని ఆయన ఆకాంక్షించారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. వైసీపీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

”పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడతారు. పోలవరం, అమరావతిని ఆపేస్తున్నారు. రోడ్లకు గుంతలు పెట్టారు. అన్నమయ్య డ్యాంను కూల్చారు. మేం ఆ డ్యాంను పునర్ నిర్మిస్తాం. వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారు. తిరిగి మనపైనే నెపాన్ని నెడుతున్నారు. మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారు” అని వైసీపీపై విరుచుకుపడ్డారు చంద్రబాబు.

రైతులకు న్యాయం చేసింది, చేసేది టీడీపీనే అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆడబిడ్డలను ఏడిపించిన వారిని చట్టం ముందు నిలబెడతాను అని హెచ్చరించారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారు.

సీమకు నీళ్లిచ్చే దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు. రాయలసీమకు నీళ్లు తెస్తామన్నారు. నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లాను.. భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు నీళ్లు తెస్తాం అని చంద్రబాబు మాటిచ్చారు. రాయలసీమకు కరవు లేకుండా చేస్తామన్నారు.
కరవు జిల్లా అనంతపురానికి కియా తెచ్చామని, ఇవాళ ఆ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నామని తెలిపారు.

సూపర్ సిక్స్… సూపర్ హిట్ అయిందన్నారు చంద్రబాబు. సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు అని నినదించారు. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయని ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు. నా బలం, బలగం ప్రజలే అని చంద్రబాబు చెప్పారు. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతామన్న సీఎం చంద్రబాబు.. లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామన్నారు.

Also Read: అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా? వాటిపై చర్చకు నేను సిద్ధం.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్..