నా మద్దతుతోనే అధికారంలోకి వచ్చింది.. కాంగ్రెస్‌లో చేరికపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
రేపే ఢిల్లీకి వెళ్తున్నా. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా. కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వైఎస్ఆర్ టీపీ చాలా పెద్ద పాత్ర పోషించింది.

YS Sharmila Key Comments On Congress Joining
YS Sharmila : కాంగ్రెస్ లో చేరిక వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేపే ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పారామె. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు తెలిపాను అన్నారు. సెక్యులర్ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నా అని వ్యాఖ్యానించారు. నన్ను ఆదరించినట్లే నా కొడుకు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియను కూడా దీవించండి అని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తనకు ఇప్పటికే ఆహ్వానం అందిందన్న షర్మిల, రేపు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. ఇడుపులపాయలో షర్మిల ఈ కామెంట్స్ చేశారు.
”కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించుకున్నాం. రేపే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ పెట్టలేదు. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 10వేల మెజార్టీతో గెలిచారు. వారు గెలవడానికి ప్రధాన కారణం మేము పోటీ చేయకపోవడమే. వైఎస్ఆర్ టీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కు చాలా ఇబ్బంది అయ్యేది. కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలోనూ ఉంది.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వైఎస్ఆర్ టీపీ చాలా పెద్ద పాత్ర పోషించింది. బీఆర్ఎస్ ఓటమికి నా వంతు కృషి చేశాను. వైఎస్ఆర్ టీపీ, నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ వాళ్లు విలువనిచ్చి ఇవాళ నన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇవాళ మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ప్రతి ఒక్కరికి భద్రతను ఇచ్చే పార్టీ కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ ను బలపరచాలని నిర్ణయించుకున్నాం. రేపే ఢిల్లీకి వెళ్తున్నా. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా. కాంగ్రెస్ పార్టీలో చేరడమైతే ఖాయం. నా కుమారుడి వివాహం సందర్భంగా మొదటి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు తండ్రి సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇడుపులపాయకి వచ్చాను” అని షర్మిల అన్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ ను సందర్శించారు. అట్లూరి ప్రియతో తన కుమారుడు రాజారెడ్డి వివాహం జరిపించనున్నట్టు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబోయే వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల ఇడుపులపాయకు వెళ్లారు. వివాహ ఆహ్వాన తొలి పత్రికను తన తండ్రి సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రాజారెడ్డి, ప్రియ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరగనుంది.
Also Read : జగన్ చెప్పినట్టే చేశాను.. నా తప్పంటే ఎలా?: వైసీపీ ఎమ్మెల్యే