చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం.. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏమన్నారంటే?

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం.. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏమన్నారంటే?

YS Sharmila wishes to Andhra Pradesh CM Chandrababu Naidau and Pawan Kalyan

Updated On : June 12, 2024 / 5:04 PM IST

YS Sharmila wishes Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ వివిధ రంగాల ప్రముఖులు సందేశాలు పంపుతున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతీకార రాజకీయాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని కోరారు. గత ఐదేళ్లలో నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలని సూచించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.

“ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. వారు చేశారని మీరు, మీరు చేశారని భవిష్యతులో మళ్లీ వాళ్లు, ఇలా ఈ పగ ప్రతీకారాలు అంతు ఉండదు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రగతికి విఘాతం కలగచేస్తుంది.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలంటూ అమిత్ షా, చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్

గడచిన ఐదేండ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలోపెట్టి ముందుకు తీసుకునివెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా నడుచుకుని, వైస్సార్ గారి విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మీకున్న అనుభవముతో మీరు పెద్దమనసు, నిష్పక్షికత చూపుతూ పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేసుంటున్నాను. ఈ సందర్భంగా, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో మీరు ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం. నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఇతర మంత్రులందరికీ మా శుభాకాంక్షల”ని వైఎస్ షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.

Also Read: హోంమంత్రి ఎవరు, ఆర్థిక శాఖ ఎవరికి.. పవన్‌కు ఇచ్చే పదవి ఏది? మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ!