వైసీపీలో మార్పులు చేర్పులతో గందరగోళంగా కర్నూలు రాజకీయం
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి గుమ్మనూరు జయరాం వైఖరితో కంగుతిన్న వైసీపీ అధిష్టానం.. జిల్లాలో ఎమ్మెల్యేలను నిశితంగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు.

yscrp changed kurnool lok sabha seat incharge gummanur jayaram
Gummanur Jayaram: అధికార వైసీపీలో మార్పులు.. ఆ మార్పుల్లో మళ్లీ మళ్లీ మార్పులతో కర్నూలు రాజకీయం గందరగోళంగా మారుతోంది. ఇప్పటికే ఓ ఎంపీతోపాటు మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కనపెట్టింది వైసీపీ అధిష్టానం.. ముఖ్యంగా మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్‌సభ ఇన్‌చార్జిగా నియమించిన కొద్దిరోజులకే తప్పించడం.. ఆయన స్థానంలో మేయర్ బీవై రామయ్యకు బాధ్యతలు అప్పగించడం హీట్‌పుట్టిస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీకి కంచుకోటైన ఈ జిల్లాలో ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు హైకమాండ్‌ను లెక్క చేయకుండా.. ధిక్కార స్వరం వినిపిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఇన్నాళ్లు సీఎం జగన్ ఆదేశాలు అన్నా.. వైసీపీ అధిష్టానం సూచనలు అన్నా.. తూ.చ. తప్పకుండా పాటించిన నేతలు.. ఇప్పుడు ఆ ఆదేశాలను.. సూచనలను పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. తమకు సీటు ఇవ్వకుంటే జెండా మార్చేస్తామంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలతో నిన్నమొన్నటివరకు స్ట్రాంగ్‌గా కనిపించిన వైసీపీలోనూ టెన్షన్ ఎక్కువవుతోంది.
అధిష్టానంతో గుమ్మనూరు టచ్‌మీ నాట్
ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్న వైసీపీ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు అసెంబ్లీ, కర్నూలు లోక్‌సభ స్థానానికి కొత్త సమన్వయకర్తలను నియమించింది. ఇందులో మంత్రి గుమ్మనూరు జయరాంతోపాటు నందికొట్కూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐతే మంత్రి జయరాం మళ్లీ ఆలూరులోనే పోటీచేస్తానని పట్టుబడుతున్నారు. తనను లోక్‌సభ అభ్యర్థిగా పంపడాన్ని జీర్ణించుకోలేని మంత్రి.. కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా కొద్దిరోజులుగా వైసీపీ అధిష్టానంతో టచ్‌మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్న మంత్రి తీరును అనుమానించిన అగ్రనాయకత్వం.. ముందుగానే జాగ్రత్త పడుతూ.. లోక్‌సభ సమన్వయకర్త పదవి నుంచి జయరాంను తప్పించింది. తాజాగా కర్నూలు మేయర్, వైసీపీ జిల్లా కన్వీనర్ బీ.వై.రామయ్యను లోక్‌సభ సమన్వయకర్తగా నియమించినట్లు తెలుస్తోంది.
జయరాం వైఖరితో కంగుతిన్న వైసీపీ అధిష్టానం
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి గుమ్మనూరు జయరాం వైఖరితో కంగుతిన్న వైసీపీ అధిష్టానం.. జిల్లాలో ఎమ్మెల్యేలను నిశితంగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చేసిన మార్పులతో ఎంపీ సంజయ్‌కుమార్ రాజీనామా చేయగా, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ నేడో.. రేపో.. రాజీనామా అన్నట్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వైసీపీలో హైటెన్షన్ కనిపిస్తోంది. ఎవరి సీటు ఉంటుందో.. ఎవరిపై వేటు పడుతుందో స్పష్టంగా తెలియక ఎమ్మెల్యేలు అంతా అభద్రతా భావంతో కుమిలిపోతున్నారు.
Also Read: నెల్లూరు వైసీపీలో కాక.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు షాక్!
కాటసాని, శిల్పాకు చాన్స్ లేదా?
ముఖ్యంగా పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను మార్చే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయాలను వేడెక్కిస్తోంది. పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాలను కంచుకోటగా మలుచుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు ఈ సారి చాన్స్ లభించడం కష్టమేనన్న టాక్‌తో క్యాడర్ అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా.. తాము మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీచేస్తామని వ్యాఖ్యానిస్తూ బెదిరింపు ధోరణిని అనుసరిస్తున్నారు ఎమ్మెల్యేలు కాటసాని, శిల్పా చక్రపాణిరెడ్డి. ఇక బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్థానంలో ఆయన సోదరుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా చల్లా శ్రీలక్ష్మిని కానీ పోటీలో పెట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read: గుమ్మనూరు జయరాంకు షాక్.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మేయర్ రామయ్య
మొత్తానికి మార్పులు వైసీపీ ఎమ్మెల్యేల్లో ముచ్చమటలు పట్టస్తుండగా.. క్యాడర్ గందరగోళాన్ని ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లు గెలుపు తమదేనన్న ధీమాను ప్రదర్శించి వైసీపీ.. మార్పులతో కోరి నష్టాన్ని తెచ్చుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.