నాకు ప్రాణహాని ఉంది.. లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ లేఖ

నాకు ప్రాణహాని ఉంది.. లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీ లేఖ

Updated On : June 23, 2021 / 3:47 PM IST

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్‌లోని నరసపురం ఎంపి రాజు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయపడుతున్నానంటూ వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తన సొంత పార్టీ పాలక నాయకులు, తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పార్టీ ఎమ్మెల్యేలు తనను అసభ్య పదజాలంతో దూషించారని అందులో వెల్లడించారు.

అంతకుముందు రఘురామకృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాశారు. నాలుగు పోలీస్ స్టేషన్ల అధికారులపై ఎస్పీకి రఘురామకృష్ణంరాజు, పీఎస్‌ వర్మ ఫిర్యాదు చేశారు. నలుగురు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరారు. ఎంపీని అసభ్య పదజాలంతో దూషించి, దిష్షిబొమ్మలు దగ్ధం చేసిన వారిపై ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీస్‌స్టేషన్లలో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎస్సైలు స్పందించలేదంటూ ఎంపీ తరపున ఎస్పీకి పీఎస్‌ వర్మ లేఖ రాశారు.

ఈ క్రమంలోనే తన దిష్టిబొమ్మను తగలబెట్టారని, పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు తనకు కూడా అదే చేస్తామని బహిరంగంగా బెదిరించారంటూ ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో చెప్పుకొచ్చారు. భక్తుల తరఫున విరాళంగా ఇచ్చిన ఆస్తులను విక్రయించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని ఎంపీ లేఖలో వెల్లడించారు.

ఒక ఎమ్మెల్యే నన్ను చంపేస్తానని బెదిరించాడని ఎంపీ చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గత కొన్ని రోజులుగా తనను బెదిరిస్తున్నారని అన్నారు. ఇసుక అమ్మకం సమస్యపై రాజు ప్రభుత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ విషయాలపై చర్చించడానికి సమయం కోరినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మాట వినలేదని రాజు చెబుతున్నారు.

Read: నాన్నే నా బలం, ఆదర్శం.. ఫాదర్స్ డే రోజున తండ్రిని గుర్తు చేసుకున్న సీఎం జగన్