YSRCP: వైసీపీలో కాపు నేతలు ఖాళీ అవుతున్నారా?

సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు.

YSRCP: వైసీపీలో కాపు నేతలు ఖాళీ అవుతున్నారా?

Updated On : December 14, 2024 / 2:38 PM IST

ఒకప్పుడు వైసీపీకి కాపు నేతలే బలం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇక కాపు కాయలేమంటున్నారు. వరుసగా గుడ్‌బై చెబుతూ కండువాలు మార్చేస్తున్నారు. వైసీపీలో కాపునేతలు ఇమడలేక పోతున్నారా.. కాపు నేతల ఆలోచన ఏంటి? జనసేనకు ఎందుకు దగ్గరఅవుతున్నారు.?

మన దేశంలో ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే.. కులాల, మతాల మద్దతు తప్పనిసరి. అయితే వైసీపీ విషయంలో మొదట్లో ఎలా ఉన్నా 2024 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. మరీ ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా చూస్తే వైసీపీకి ఎన్నడూ లేని చిక్కులు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి కాపు నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు.

జగన్‌.. వైస్సార్‌ కాంగ్రెస్ పార్టీని ప్రకటించినప్పుడు ఆయన వెంట కాపుసామాజిక వర్గం నేతలు అధికంగా ఉన్నారు. పార్టీకి కాపులే పునాదిగా ఉంటూ వచ్చారు. 2018లో గోదావరి జిల్లాల్లో జగన్‌ పాదయాత్ర చేస్తున్న వేళ కాపులు బలంగా నిలబడ్డారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులను బాగానే చూసుకుంటూ వచ్చారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చాక కాపుల స్టాండ్ కొద్దికొద్దిగా మారుతూ వచ్చింది. పవన్‌ని ఏమైనా అంటే తమనే అన్నట్లుగా కాపులు తీసుకున్నారు. దాంతోనే కాపుల్లో వైసీపీకి వ్యతిరేకత మొదలైందనే చర్చ జరుగుతుంది.

అందుకే వారంతా కూటమి వైపు చూస్తున్నారా?
మరోవైపు ఏపీలో టీడీపీతో పాటు జనసేన కూడా బలమైన ఆల్టర్‌నేటివ్‌గా మారిపోయింది. కాపులకు తమకొక పార్టీ ఉన్నదన్న భావన ఏర్పడుతోంది. అందుకే వారు అంతా ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారని కాపుల్లో ఇన్నర్‌టాక్. దాంతోనే వైసీపీని వీడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

భీమవరంలో 2019 ఎన్నికల్లో పవన్‌ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ కూడా ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. విశాఖ జిల్లా భీమిలీకి 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా కూడా మూడేళ్ళ పాటు పనిచేసిన అవంతి శ్రీనివాస్ కూడా తాజాగా రాజీనామా చేశారు. ఇక గోదావరి జిల్లాలో మరో ఇద్దరు మాజీ మంత్రులు ఒక డైనమిక్ యంగ్ మాజీ ఎమ్మెల్యే కూడా  పార్టీని వీడుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.

మరోవైపు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు. ఇలా వైసీపీని వీడిన  కాపు నేతలు జనసేన వైపు చూప్తున్నారు. ఇప్పటికే సామినేని ఉదయబాబు, రోశయ్య జనసేన కండువా కప్పుకున్నారు. వీరి బాటలోనే అవంతి శ్రీనివాస్ కూడా పవన్ పక్షం చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆళ్ల నాని, గ్రంధి శ్రీనివాస్ చేరికలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది.

వైసీపీలో లోపం ఎక్కడ ఉందో గమనించి, చక్కదిద్దుకోవాల్సిన అవసరముందని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకపోతే ఇదే జోరు కొనసాగితే ఫ్యాన్ రెక్కలు సైతం కదలకుండా బ్రేకులు పడతాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

USA Deportation: అమెరికాలో భారతీయులకు బిగ్‌షాక్‌.. వారంతా వెనక్కు రావాల్సిందే!