గాజువాకలో ఓడిపోయాడు.. అందుకే ఉత్తరాంధ్రపై పవన్ కు ద్వేషం

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేత, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకి పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలె పడితే జాలి వస్తుందనే విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందుకంత కడుపు మంటని నిలదీశారు. చంద్రబాబు ఒక ఉన్మాదిలా ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో బినామీ భూములు లేవని రాజధానిని వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్… ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సీరియస్ అయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి ముసుగులో చంద్రబాబు టీడీపీ నేతలతో ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. సోమవారం(జనవరి 13,2020) తాడేపల్లిలో ఎమ్మెల్యే ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరు కాదని ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు. గాజువాకలో ఓడిపోయాడు కాబట్టే.. ఉత్తరాంధ్రపై పవన్ కు ద్వేషం అని అన్నారు. విశాఖ రాజధాని అయితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని… ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృధ్ది చెందుతుందని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. ముంబైతో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందన్నారు. రాయలసీమలో హైకోర్టు పెడితే నాలుగు జిరాక్స్ మిషన్లు వస్తాయని రాయలసీమ ప్రాంతాన్ని అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణం అన్నారు.