రాజోలు వైసీపీలో వర్గపోరు.. రాపాక ఎంట్రీకి అడ్డుకట్ట?

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి పెదపాటి అమ్మాజీ, మాజీ ఇన్‌చార్జి బొంతు రాజేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు కేడర్‌ను రెండు వర్గాలుగా విభజించిందట. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు అని తేడా లేకుండా నాయకులు వ్యవహరిస్తున్న తీరు కార్యకర్తల్లో గందరగోళానికి కారణం అవుతోందని అంటున్నారు. రోడ్డెక్కి రచ్చ చేస్తుండడంతో పార్టీ పరువుకు భంగం వాటిల్లుతోంది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రతినిధ్యం వహిస్తోన్న ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు కేడర్, ప్రజలు, అధికారులకు చికాకు తెప్పిస్తోందని అంటున్నారు.
అసంతృప్తిలో వైసీపీ కేడర్ :
వర్గ పోరుతో గత ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులు ఇంకా వాటిని కొనసాగించడంతో వైసీపీ కేడర్ అసంతృప్తిగా ఉంది. ఇన్‌చార్జిల నియామకం విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం నియోజకవర్గంలో వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసిందన్నది టాక్. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావును వైసీపీ అధిష్టానం ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జి భాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో తుని నియోజకవర్గానికి చెందిన పెదపాటి అమ్మాజీని ఇన్చార్జిగా నియమించింది. ఇటీవల మాల కార్పొరేషన్ చైర్మన్‌గా అమ్మాజీని నియమించిన కొద్ది రోజుల్లోనే మళ్లీ రాజోలుకు ఇన్‌చార్జిని చేయడం వెనుక అధిష్టానం స్కెచ్ ఉందంటున్నారు.
బొంతును పక్కన పెట్టి :
రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీకి సానుభూతిపరుడిగా మారారు. దీంతో ఆయన కోసమే బొంతును పక్కన పెట్టి అమ్మాజీని తెరపైకి తీసుకువచ్చారని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. గతం నుంచి బొంతుకు, రాపాకకు మధ్య విభేదాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని బొంతుకు ప్రాధాన్యం తగ్గించారని అంటున్నారు. ఒకవేళ రాపాక వైసీపీలో చేరితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు అమ్మాజీని తాత్కాలిక ఇన్‌చార్జిగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో రాపాక విజయానికి పనిచేసిన కొంతమంది నాయకులు ఇటీవల వైసీపీలో చేరడం, వారంతా కూడా అమ్మాజీకి మద్దతు ఇవ్వడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోందట.
మరోపక్క, పదేళ్ల పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసి, పార్టీ అధినేత జగన్‌కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న రాజేశ్వరరావు ఇటీవల నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారట. తాను ఓడిపోయినా పార్టీ అధికారంలోకి రావడంతో అనధికార ఎమ్మెల్యేగా చలామణీ అవుదామనుకున్నారట. కానీ, ఆయన ఆశలకు రాపాక, అమ్మాజీ వర్గాలు గండికొట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మాజీ ఆధిపత్యానికి, రాపాక ఎంట్రీకి అడ్డుపడేందుకు బొంతు రాజేశ్వరరావు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమం అని తేడా లేకుండా వారిద్దరితో పోటీ పడుతున్నారట బొంతు. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు లేదా అమ్మాజీ వర్గం నుంచి వ్యతిరేకత ఎదురైతే తమ వర్గం ద్వారా ప్రత్యక్ష ఆందోళన చేయించడానికి కూడా వెనుకాడటం లేదట. ఇటీవల జరిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కమిటీ సభ్యుల విషయంలో ఇదే జరిగిందంట. ఎవరికి వారు కళ్యాణం కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారాలను సిద్ధం అయ్యారని అంటున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరు వలన పోలీసులు, రాపాక హీరో అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య మరోసారి విభేధాలు రచ్చకెక్కాయని చెబుతున్నారు. అధిష్టానం దృష్టి పెట్టకపోతే నియోజకవర్గాన్ని వైసీపీ శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు.