స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాల్సిందే.. తేడా వస్తే టికెట్ ఉండదు!

  • Published By: sreehari ,Published On : March 11, 2020 / 06:40 AM IST
స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాల్సిందే.. తేడా వస్తే టికెట్ ఉండదు!

Updated On : March 11, 2020 / 6:40 AM IST

కేవలం గెలుపు మాత్రమే కాదు.. బంఫర్ మెజారిటీ సాధించాలి. అది కూడా సార్వత్రిక ఎన్నికల కంటే ఘనంగా ఉండాలి. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకూడదు. మొత్తం క్లీన్ స్విప్ అయిపోవాలి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ టార్గెట్. మరి అంత పెద్ద టార్టెట్ రీచ్ అవ్వాలంటే వ్యూహాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. ఇంతకీ వైసీపీ అమలు చేస్తున్న వ్యూహాలేంటి.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. అన్ని ఎన్నికలు ఒకే నెలలో రావడంతో నేతలంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇక అధికార పార్టీ అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలను క్లీన్‌స్వీప్ చెయ్యాలని చూస్తోంది. ఇందుకోసం పక్కా వ్యూహాలను అమలు చేస్తోంది.

గెలుపు కోసం నేతల వ్యూహాలు :
లోకల్‌వార్‌కు అన్ని రకాలుగా అధికార వైసీపీ సిద్ధమైంది. మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఎన్నికల క్షేత్రంలో దూకేశారు. అయితే ఈ ఎన్నికల్లో బంఫర్ మెజారిటీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ అందుకు కావల్సిన అన్ని అస్త్రాలను వినియోగిస్తోంది. ముందుగా పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టారు సీఎం జగన్. మంత్రులకైతే ఏకంగా పదవులే పోతాయంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలకు నియోజక వర్గాల్లో తేడా వస్తే టికెట్ ఉండదని తేల్చి చెప్పేశారు. దీంతో నేతలంతా గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. అంతే కాకుండా పార్టీలోని కీలక నేతలకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారు జగన్. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి, ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి, రాయలసీమ బాధ్యతలు సజ్జల రామకృష్టారెడ్డికి అప్పగించారు.

సంక్షేమ పథకాలపైనే వైసీపీ ఆశలు :
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అనేక వ్యూహాలు అమలు చేస్తూనే సంక్షేమ పథకాలపైనే వైసీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. గత 9 నెలల నుండి అమలు అవుతున్న పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అధికారం వచ్చిన 9 నెలల్లోనే దాదాపు 80 శాతం మ్యానిఫెస్టో అమలు చెయ్యడంతో పాటు, ఎన్నికల్లో ఇవ్వని హామీలను  కూడా చేశామంటూ ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. దీంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని పెద్ద ఎత్తున జపిస్తున్నారు. అయితే గ్రామ స్థాయిలో విజయం సాధించడంతో పాటు, ముఖ్యమైన విజయవాడ, గుంటూరు, వైజాగ్ వంటి కార్పొరేషన్ల పైనా ప్రత్యేక దృష్టి పెట్టారు.

నిఘా కోసం ప్రత్యేక యాప్ :
ఇక ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. పంచాయితీ రాజ్ చట్టంలోని అంశాలను సవరణలు చేసి ప్రతిపక్ష పార్టీలను భయాందోళనలకు గురిచేసింది. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని ఆదేశాలిచ్చిన సీఎం..  నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష తేడా చూడొద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇందుకోసం నిఘా పేరుతో ప్రత్యేక యాప్‌ను జగన్‌ ప్రారంభించారు. ప్రజలే నేరుగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను క్లీన్ స్వీప్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న అధికార పార్టీ అందుకు అనుగుణంగా పక్కా వ్యూహాలు అమలుచేస్తోంది. మరి అధికార పార్టీ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది ఓటర్లే నిర్ణయించాలి.

See Also | శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా…విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ లక్షణాలు