తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు: వైవీ సుబ్బారెడ్డి
స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద నెపం వేశారని..

YV Subbareddy
టీటీడీ లడ్డూ ప్రసాదం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లపై టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో టీటీడీ లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూపై చంద్రబాబు నీచాతి నీచంగా మాట్లాడారని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. స్వామివారి పవిత్రతను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద నెపం వేశారని అన్నారు.
తాను నాలుగేళ్లు టీటీడీ చైర్మన్‌గా ఉంటూ భక్తుల మనోభావాలు కాపాడానని చెప్పుకొచ్చారు. జంతువుల కొవ్వు వాడుతున్నారని అనడానికి ఆ మాటలు ఎలా వచ్చాయని నిలదీశారు. చంద్రబాబు నాయుడు మోపిన నింద నిజమో కాదో అన్న విషయంపై కుటుంబంతో పాటు వచ్చి ప్రమాణం చేద్దాం రండి అని సవాలు విసిరారు. ప్రమాణానికి రాకపోతే భక్తులకు, శ్రీవారికి క్షమాపణ చెప్పాలని అన్నారు. చంద్రబాబు నాయుడు వేసిన నిందపై తాము న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు.