AP Bjp : ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తారా? ఏపీ బీజేపీలో సీనియర్ల అలక

6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.

AP Bjp : ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తారా? ఏపీ బీజేపీలో సీనియర్ల అలక

AP Bjp : ఏపీ బీజేపీలో సీనియర్ల అలక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇవాళ్టి పదాధికారుల సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి సోమువీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ దూరంగా ఉన్నారు. ఈ నలుగురు నేతలు ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు. 6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.

ఏపీ బీజేపీ నేతలు తమ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలంతా డుమ్మా కొట్టారు. ప్రధానంగా ఏపీ బీజేపీ ఎంపీ సీట్లు ఆశించిన నేతలు టికెట్లు దక్కకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్లు దక్కించుకున్న వారితో పాటు సీనియర్లకు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది. కానీ, కొందరు సీనియర్లు గైర్హాజరయ్యారు. బీజేపీ అధిష్టానం ఏపీలోని ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ సీటు కోసం జీవీఎల్ పట్టుబట్టారు. కానీ, పొత్తులో భాగంగా బీజేపీకి అనకాపల్లి సీటు వచ్చింది. అనకాపల్లి సీటు కోసం జీవీఎల్, సీఎం రమేశ్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వే చేయగా.. అధిష్టానం సీఎం రమేశ్ వైపు మొగ్గు చూపింది.

మరోవైపు పురంధేశ్వరికి కేటాయించిన రాజమండ్రి ఎంపీ సీటును సోమువీర్రాజు సైతం ఆశించారు. తాను రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తానని ఆయన పలుమార్లు చెప్పారు. అయితే, రాజమండ్రి టికెట్ పురంధేశ్వరికి ఇవ్వడంతో సోమువీర్రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తిరుపతి సీటును వైసీపీ నుంచి వచ్చిన వరప్రసాద్ కు కేటాయించడం పట్ల సీనియర్లు కొంత ఆగ్రహంగా ఉన్నారు. మరో సీనియర్ నేత సత్యకుమార్ హిందూపురం, రాజంపేటలలో ఏదో ఒక ఎంపీ సీటు ఇవ్వాలని ఆశించారు. కానీ, అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపింది.

ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే.. వారిలో ఐదుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారు. సీనియర్ గా ఉన్న తమకు ప్రయారిటీ ఇవ్వడం లేదని సీరియస్ గా ఉన్నారు. ఇక అసెంబ్లీ సీట్లకు సంబంధించి దాదాపు 10 స్థానాల్లో 6 నుంచి 7 స్థానాలు ఇతర పార్టీల వారికి ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వకపోతే కచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తామని సీనియర్లు నుంచి అందుతున్న సమాచారం.

Also Read : మచిలీపట్నం నుంచి నాగబాబు, అవనిగడ్డ నుంచి బాలశౌరి? చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం?