Cm Ramesh Vs Budi Mutyala Naidu : డిప్యూటీ సీఎం వర్సెస్‌ సీఎం రమేశ్‌.. అనకాపల్లిలో గెలిచేది ఎవరు?

మరి గ్రామీణ నేపథ్యం గెలుస్తుందా? ఢిల్లీ స్థాయి పలుకుబడి నెగ్గుతుందా? అనకాపల్లి రేసుగుర్రం ఎవరు?

Cm Ramesh Vs Budi Mutyala Naidu : డిప్యూటీ సీఎం వర్సెస్‌ సీఎం రమేశ్‌.. అనకాపల్లిలో గెలిచేది ఎవరు?

Cm Ramesh Vs Budi Mutyala Naidu

Cm Ramesh Vs Budi Mutyala Naidu : ఒకరు డిప్యూటీ సీఎం.. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు లోక్‌సభ బరికి సై అంటున్నారు. మరొకరిది ఢిల్లీ స్థాయి రాజకీయం. వ్యాపారవేత్తగా ఉంటూ ప్రముఖ నేతల పరిచయాలతో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా.. ప్రజాక్షేత్రంలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. భిన్న నేపథ్యాలు ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో పరస్పరం తలపడుతున్నారు. మరి గ్రామీణ నేపథ్యం గెలుస్తుందా? ఢిల్లీ స్థాయి పలుకుబడి నెగ్గుతుందా? అనకాపల్లి రేసుగుర్రం ఎవరు?

15 ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్‌ విజయం..
అనకాపల్లి లోక్‌సభ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎందరో ఉద్ధండులైన నేతలు ప్రాతినిధ్యం వహించిన అనకాపల్లి లోక్‌సభ స్థానానికి ఘన చరిత్ర ఉంది. 1962లో ఏర్పడిన ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే, 9 సార్లు కాంగ్రెస్సే గెలిచింది. అంతేకాకుండా ఓ సారి కేవలం 9 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌ ఓ చరిత్రనే సృష్టించింది. ఇక టీడీపీ ఐదుసార్లు గెలవగా, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ గత ఎన్నికల్లో తొలిసారి గెలిచింది. ఈ సారి కూడా గెలవాలని పావులు కదుపుతోంది వైసీపీ. అందుకే రాష్ట్రంలోని 25 స్థానాల్లో 24 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఆచితూచి ఎంతో ఆలోచించి అనకాపల్లి అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దింపింది. ఇక కూటమి తరఫున కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేశ్‌ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

లోకల్, నాన్ లోకల్ నినాదం..
సుమారు 13 లక్షల 50 వేల ఓట్లు ఉన్న అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో.. కాపు, గవర, కొప్పుల వెలమ సామాజికవర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే దాదాపు 70 శాతంగా చెబుతున్నారు. అందుకే అనకాపల్లికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఈ మూడు కులాల వారినే అభ్యర్థులుగా పెడుతుంటారు.

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గానికి చెందిన వారు కాగా, సీఎం రమేశ్‌ స్వస్థలం రాయలసీమలోని కడప జిల్లా.. పొత్తుల్లో భాగంగా అనకాపల్లి బీజేపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ సీఎం రమేశ్‌కి చాన్స్‌ ఇవ్వడంతో తొలిసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అధికార వైసీపీ ఆయన నాన్‌ లోకల్‌ అంటూ ప్రచారం చేస్తూ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది.

అలా.. టికెట్ దక్కించుకున్న సీఎం రమేశ్..
ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలు ఉండగా, విశాఖ పార్లమెంట్‌ స్థానానికి తరుచుగా నాన్‌లోకల్‌ లీడర్లే పోటీ చేస్తుండేవారు. అక్కడి ఓటర్లు కూడా లోకల్‌, నాన్‌లోకల్‌ అనే ఫీలింగ్‌ లేకుండా రాష్ట్రంలో గెలిచే పార్టీనే ఆదరించే వారు. ఐతే ఈ సారి పొత్తుల్లో భాగంగా విశాఖను వదులుకోడానికి టీడీపీ ఇష్టపడకపోవడంతో.. అనకాపల్లి నియోజకవర్గాన్ని తీసుకుంది బీజేపీ… దీంతో విశాఖ నుంచి పోటీ చేయాలని భావించిన సీఎం రమేశ్‌ అనూహ్యంగా అనకాపల్లి అభ్యర్థిగా వచ్చారు. అంతేకాకుండా సీఎం రమేశ్‌ సామాజికవర్గం కూడా అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువగా ఉండటంతో బీజేపీలోని మిగిలిన ఆశావహులను వెనక్కి నెట్టి టికెట్‌ దక్కించుకున్నారు సీఎం రమేశ్‌.

ఆర్థికంగా బలమైన నేతను ఢీకొట్టేందుకు వైసీపీ వ్యూహం..
వాస్తవానికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని కూటమి తరఫున టీడీపీ నుంచి చింతకాయల విజయ్‌, జనసేన నుంచి నాగబాబు, కొణతాల రామకృష్ణ భావించారు. ఐతే ఈ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లడంతో ఆ పార్టీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావును వెనక్కినెట్టి టికెట్‌ దక్కించుకున్నారు సీఎం రమేశ్‌. ఇక సీఎం రమేశ్‌ సామాజిక వర్గానికే చెందిన బూడి ముత్యాలనాయుడిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన వైసీపీ… కూటమికి చెక్‌ చెప్పింది. వాస్తవానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఈ సారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తొలుత నిర్ణయించింది వైసీపీ. ఐతే ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేశ్‌ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతోపాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన వైసీపీ.. బూడి ముత్యాలనాయుడిని తొలిసారిగా ఎంపీ బరిలోకి దింపింది.

Also Read : టార్గెట్‌ బాలయ్య.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటమికి వైసీపీ భారీ స్కెచ్‌..! ఏంటా వ్యూహం

అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన నేతగా రికార్డు..
సీఎం జగన్‌ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న బూడి ముత్యాలనాయుడిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి బూడి వెంకునాయుడు 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా పని చేశారు. ముత్యాలనాయుడు కూడా పంచాయతీ వార్డు మెంబర్‌గా రాజకీయాల్లో ప్రవేశించి ఒక్కోమెట్టు ఎక్కారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బూడి ముత్యాలనాయుడు 1989 నుంచి ఎమ్మెల్యేగా పోటీకి ఉత్సాహం చూపేవారు. సుమారు ఇరవయ్యేళ్ల పాటు ఎంత ప్రయత్నించినా, కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు చాన్స్‌ ఇవ్వలేదు. దీంతో 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు ఎంపీగా కూడా పోటీకి సిద్ధమై అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన నేతగా రికార్డు సృష్టించారు.

ముత్యాలనాయుడు ముందు పెను సవాల్..
ఐతే గత ఐదేళ్లలో ఆయన పనితీరుపై వ్యతిరేకత, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు, సొంత కుమారుడితోనూ వివాదం, నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవడం ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని.. తానైతే అందరికీ అందుబాటులో ఉంటానని.. తాను లోకల్‌ అంటున్నారు బూడి ముత్యాలనాయుడు.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి సీఎం రమేశ్..
ఇక కూటమి తరఫున బీజేపీ నేత సీఎం రమేశ్‌ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా అనకాపల్లి ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేశ్‌ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించిన సీఎం రమేశ్‌.. గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన సీఎం రమేశ్‌ దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీ తరఫున తెరవెనుక మంత్రాంగం నడపడం, ఆర్థిక వనరులు సమకూర్చడంలో కీలకపాత్ర పోషించే వారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీలో చేరారు.

రమేశ్ ను ఇరుకున పెట్టేలా వైసీపీ వ్యూహం..
ఇక ఈ ఎన్నికల సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి అనకాపల్లి నుంచి రంగంలోకి దిగారు. వాస్తవానికి విశాఖ నుంచి పోటీ చేయాలని తొలుత భావించినా, టీడీపీ ఆ సీటు కేటాయించకపోవడంతో తన సొంత సామాజిక వర్గం ఉన్న అనకాపల్లిని ఎంచుకున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కొప్పుల వెలమ ఓట్లు దాదాపు మూడు లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. సీఎం రమేశ్‌ను ఇరుకున పెట్టేందుకు వైసీపీ నాన్‌లోకల్‌ బాణం సంధిస్తోంది. అయితే వైసీపీని దీటుగా ఎదుర్కొంటున్న సీఎం రమేశ్‌ తన వాక్‌ చాతుర్యంతో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అనకాపల్లిలో కూటమి జెండా ఎగరేయడం ఖాయమని ధీమా చూపుతున్నారు సీఎం రమేశ్‌.

లోకల్ వర్సెస్ నాన్ లోకల్..
మొత్తానికి అనకాపల్లిలో ఉభయ పక్షాలు దూకుడు చూపుతున్నాయి. వైసీపీ అభ్యర్థి అధికార బలంతోను, కూటమి అభ్యర్థి ధన బలంతోను హోరాహోరీగా తలపడుతున్నారు. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి లోకల్‌ నినాదాన్నే ఎక్కువగా నమ్ముకుంటుండగా, కూటమి అభ్యర్థి అభివృద్ధి రాగం ఆలపిస్తున్నారు. జనం ఈ ఇద్దరిలో ఎవరి వాదన ఆలకిస్తారనేది చూడాల్సివుంది.

Also Read : తొలిసారి వైసీపీ బీసీ ప్రయోగం.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మైలవరం