ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? మరింత ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్
జాతీయ సర్వే సంస్థలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమివైపు మొగ్గుచూపగా.. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని తెలిపాయి.

Ap Elections 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వే సంస్థలు టీడీపీ వైపు మొగ్గుచూపాయి. మరికొన్ని సంస్థలు వైసీపీకి పట్టం కట్టాయి. ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఏపీలో ఓటరు నాడి పట్టుకోవడం కత్తి మీద సాములా మారింది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ.. ఓటర్ ఎటువైపు ఉన్నాడు? అనేది పోలింగ్ తర్వాత తెలుసుకోవడం కష్టంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే పరిస్థితిని సూచించాయి.
కొన్ని టీడీపీకి, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీకి మద్దతుగా నిలిచాయి. వైసీపీకి 98 నుంచి 116 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే తెలిపింది. కూటమి కేవలం 59 నుంచి 77 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం వైసీపీకి 91-101 సీట్లు, Q మెగా సర్వే ప్రకారం 120 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఆరా మస్తాన్ సర్వే వైసీపీ 94-104 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. పార్ధ్ దాస్ ప్రకారం 110 నుంచి 115 సీట్లు వస్తాయని తెలిపింది.
మరికొన్ని సంస్థలు టీడీపీకి పట్టం కట్టాయి. కూటమికి 113 నుంచి 122 సీట్లు వస్తాయని రైజ్ సంస్థ తెలిపింది. వైసీపీకి కేవలం 48 నుంచి 60 సీట్లు వస్తాయంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం టీడీపీ 114 నుంచి 122 సీట్లు గెలుచుకుంటుందని.. వైసీపీ 39-49 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. పోల్ పల్స్ సర్వే సంస్థ ప్రకారం టీడీపీకి 108 నుంచి 116 సీట్లు వస్తాయని, వైసీపీ 48 నుంచి 56 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ప్రకారం కూటమికి 111 నుంచి 135 స్థానాలు వస్తాయని, వైసీపీకి 45 నుంచి 60 సీట్లే వస్తాయంది.
సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. అసలు ఫలితాలు తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సింది. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో జూన్ 4న తెలిసిపోనుంది.
ఏపీ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలను సూచించాయి. జాతీయ సర్వే సంస్థలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమివైపు మొగ్గుచూపగా.. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని తెలిపాయి. 2019లో వైపీపీ 22 ఎంపీ సీట్లను గెలుచుకోగా, దాదాపు అన్ని సర్వే సంస్థలు ఈసారి ఎంపీ సీట్లు సంఖ్య తగ్గుతుందని అంచనా వేశాయి. జాతీయ సర్వే సంస్థలు మాత్రం టీడీపీ కూటమి ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని వెల్లడించాయి.
ఇండియా టీవీ సర్వే ప్రకారం.. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 20 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. వైసీపీకి 3-5 ఎంపీ స్థానాలకు వచ్చే అవకాశం ఉందంది.
సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం కూటమి 19 నుంచి 22 సీట్లలో విజయం సాధిస్తుందని పేర్కొంది. వైసీపీ 5-8 సీట్లకే పరిమితం కానుంది.
ఏబీపీ సర్వే సంస్థలో టీడీపీ కూటమికి 21 నుంచి 25 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. వైసీపీ 0-4 సీట్లకు పరిమితం కానుంది.
జన్ కీ బాత్ సర్వే సంస్థ అంచనా ప్రకారం టీడీపీ కూటమికి 10 నుంచి 14 ఎంపీ సీట్లు, వైసీపీకి 8 నుంచి 13 లోక్ సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
ఇండియా టుడే సర్వే ప్రకారం టీడీపీకి 13 నుంచి 15 సీట్లు, బీజేపీకి 4 నుంచి 6, జనసేన 2 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని.. వైసీపీకి 2 నుంచి 4 సీట్లే వస్తాయంది. ఈ లెక్కన మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో ప్రజలు కూటమి వైపు ఉన్నారని సర్వే సంస్థలు తెలిపాయి.
మరోవైపు కొన్ని స్థానిక సర్వే సంస్థలు మాత్రం వైసీపీకి పట్టం కట్టాయి. వైసీపీ 16 నుంచి 17 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. టీడీపీకి కేవలం 8 నుంచి 9 సీట్లు వస్తాయంది. తెలంగాణ ఎన్నికల్లో సరైన ఫలితాలు ఇచ్చిన ఆరా సంస్థ వైసీపీకి 13 నుంచి 15 లోక్ సభ స్థానాలు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు వస్తాయని పేర్కొంది. హెచ్ఎంఆర్ సర్వేలో 13 నుంచి 17 స్థానాలు వైసీపీ గెలుస్తుందని, టీడీపీ కూటమి 08 నుంచి 12 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ చూశాక అన్ని పార్టీలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. కచ్చితంగా అధికారం తమదే అని చెబుతున్నారు.
Also Read : వైసీపీదే గెలుపు? భారీ మెజార్టీతో పవన్ విజయం? ఆరా మస్తాన్ సంచలన సర్వే