గొప్ప తేజస్సు ఉన్న అమ్మవారు ఏకవీరా దేవి.. తమలపాకు, వక్కలను నూరి ప్రసాదంగా..
ఇక్కడ రేణుకామాతగానూ అమ్మవారిని పిలుచుకుంటారు.

Ekaveerikadevi Shakthi Petham
Ekaveerikadevi Shakthi Petham: దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి కుడిచేయి మహారాష్ట్రలోని మాహూర్ ప్రాంతంలోనే పడింది. ఈ క్షేత్రంలో ఏకవీరాదేవి వెలసింది. రేణుకామాతగానూ అమ్మవారిని పిలుచుకుంటారు. తమలపాకు, వక్కలను నూరి ప్రసాదంగా ఇస్తారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు నాందేడ్‌కు ఈశాన్యంగా, సుమారు 135 కి.మీ. దూరంలో మహూర్‌గడ్ అనే క్షేత్రం ఉంది. మహూర్ బస్‌స్టాండ్‌కు దాదాపు 3 కి.మీ. దూరంలో ఎత్తైన పర్వతంమీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం వుంది. రేణుకాదేవినే శ్రీ ఏకవీరికాదేవిగా కొలుస్తారు. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవదిగా ఖ్యాతి పొందింది ఏకవీరాదేవి శక్తిపీఠం. (Ekaveerikadevi Shakthi Petham)
ఆలయమంతా సిందూర రంగులో దర్శనమిచ్చే శ్రీ ఏకవీరికాదేవి మందిరము చాలా ప్రాచీనమైనది. చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం ఉంటుంది. ముందుగా శ్రీ పరశురామ్ గణేశ్ దర్శనము చేసుకున్నాక తరువాత రేణుకామాత (ఏకవీరికాదేవి) దర్శనము చేసుకోవాలి. రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సిందూరం పూస్తారు.
అమ్మవారి ముక్కు, నోరు, కళ్లు స్పష్టంగా చూడవచ్చు. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. చక్కటి అలంకారంతో ఉన్నా కాస్త భయానకంగా కూడా దర్శమిస్తుంటుందీ ఏకవీరాదేవి. మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక ఉంటుంది. మరోపక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. భక్తులు అమ్మవారి ప్రతిమకు కుంకుమార్చన చేసుకుని తరిస్తారు.
మహూర్‌గడ్ క్షేత్రం శ్రీ రేణుకాదేవి మందిరంతో పాటు శ్రీ దత్తపీఠం, శ్రీ అనసూయమాత మందిరాలు ఉన్నాయి. క్షేత్రములో శ్రీ పరశురామమందిరం, శ్రీ సర్వతీర్థ, శ్రీకైలాసగిరి, శ్రీవనదేవి, శ్రీమహాకాళి మందిరము, శ్రీ చింతామణి మందిరం, శ్రీ మాతృతీర్థ, శ్రీగోముఖ, శివతీర్థ, శ్రీపాపహరణికుండ్, శ్రీఅమ్‌త్‌కుండ్, శ్రీఆత్మబోదకుండ్, శ్రీజమదగ్నిగుట్ట, పాండవులగుహ, కోఠిభూమి, సంగమేశ్వరం, శ్రీదేవదేవేరిమందిరం, మ్యూజియం కూడా చూడాల్సిన ప్రదేశాలు.